Satyavathi Rathod: తెలంగాణలోని ప్రముఖ పుణ్య క్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని ఆదివారం ఉదయం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు మంత్రికి ప్రత్యేక స్వాగతం పలికి.. ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ యాదాద్రి ప్రధానాలయ బంగారు తాపడానికి తన ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను విరాళంగా ఇచ్చారు. రెండు చేతి గాజులు, రింగులు, మెడ గొలుసు ను లక్ష్మి నరసింహ స్వామికి నిలువుదోపిడీ ఇచ్చారు. మొత్తం స్వామివారికి 12 తులాల బంగారు ఆభరణాలను విరాళంగా ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ.. తాను కరోనా మహమ్మారి నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని స్వామివారిని ప్రార్థించానని చెప్పారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో.. పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని తాను నరసింహ స్వామిని ప్రార్ధించినట్లు తెలిపారు.
సీఎం కేసీఆర్ ఆలోచనాత్మక రూపకల్పనలో యాదాద్రి దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా మారబోతోంది. యాదాద్రి ఆలయ విమాన గోపురానికి 125 కిలోల బంగారంతో తాపడం చేయిస్తామని, ఇందుకు విరాళాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. అంతేకాదు కేసీఆర్ తన ఫ్యామిలీ తరఫున కిలో 16 తులాల బంగారం విరాళంఇచ్చారు. సీఎం పిలుపుతో యాదాద్రి ఆలయ విమాన గోపురం బంగారు తాపడానికి విరాళాలు భారీగా వస్తున్నాయి. వ్యాపార, వాణిజ్య సంస్థల యజమానులు, ప్రజాప్రతినిధులు, వ్యాపార వేత్తలు, ప్రముఖులు ముందుకు వచ్చి కిలోల కొద్దీ బంగారాన్నిలక్ష్మీనరసింహ స్వామికి విరాళంగా ఇస్తున్నారు.
Also Read: