Telangana: భారీ వర్షాలతో అపార నష్టం.. వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌

| Edited By: Narender Vaitla

Sep 09, 2024 | 8:34 PM

ఆయా శాఖలకు సంబంధించి ఎంత నష్టం జరిగింది, ఎన్ని నిధులు కావల్సిన అంశాలపై పకడ్బంధిగా అంచనా వేయాలని సూచించారు. కేంద్రానికి పంపవలసిన నివేదికలలో పొందుపరచవలసిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి తయారు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే వరద ప్రాంతాలలో ఎనుమరేషన్ కూడా పక్కాగా జరగాలని సూచించారు...

Telangana: భారీ వర్షాలతో అపార నష్టం.. వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌
Telangana
Follow us on

తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల ప్రభావంపై రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం సలహాదారులు శ్రీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఆయా శాఖలకు సంబంధించి ఎంత నష్టం జరిగింది, ఎన్ని నిధులు కావల్సిన అంశాలపై పకడ్బంధిగా అంచనా వేయాలని సూచించారు. కేంద్రానికి పంపవలసిన నివేదికలలో పొందుపరచవలసిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి తయారు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే వరద ప్రాంతాలలో ఎనుమరేషన్ కూడా పక్కాగా జరగాలని సూచించారు. ఆయా శాఖల పరంగా జరిగిన నష్టాన్ని ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాలలో యుద్ధ ప్రతిపాదికన బాధితులకు సహాయమందించాలని మంత్రి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బాధితులకు ఈ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చివరి బాధితుని వరకు సహాయం అందిస్తామని ప్రకటించారు.

భారీ వర్షాలు, వరదలకు రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని 33 జిల్లాలను వర్షాప్రభావిత జిల్లాలుగా ప్రకటించామని తెలిపారు. భారీ వర్షాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 33 మంది మృతి చెందారని ఇందులో ప్రధానంగా ఖమ్మంలో 6 మంది, కొత్తగూడెంలో 5 మంది, ములుగులో 4 మంది, కామారెడ్డిలో ముగ్గురు, వనపర్తిలో ముగ్గురు చనిపోయారని అధికారులు మంత్రికి వివరించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాన్ని కూడా అందచేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
ఇటీవల కురిసిన వర్షాలు, వరదల వల్ల రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఇండ్లు పూర్తిగా పాక్షికంగా కూలిపోయాయి. వీటిని వెంటనే గుర్తించి బాధితులకు రూ. 5 లక్షల రూపాయలతో ఉచితంగా ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సూచించారు.

వర్షాలలో దెబ్బతిన్న ప్రతి ఇంటికీ రూ.16,500 చొప్పున సహాయం అందిస్తున్నామని తెలిపారు. ఎలాంటి అవినీతి, అక్రమాలకు ఆస్కారం లేకుండా వరద సహాయం పూర్తిగా ఆన్లైన్ ద్వారానే బాధితుల అక్కౌంట్లోకి జమ చేస్తున్నామని వెల్లడించారు. వరద సమయంలో గౌరవ ముఖ్యమంత్రిగారు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించినప్పుడు కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారని, అయితే జరిగిన నష్టాన్ని చూసి మానవతా ధృక్పథంతో రూ.16,500 కి పెంచినట్టు వెల్లడించారు. ఈ సహాయాన్ని ఈరోజు నుంచే బాధితులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం లక్షలాది ఎకరాల పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు మంత్రికి తెలిపారు. వరద ముప్పుకు గురైన ప్రతి ఎకరానికి రూ. 10 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..