దావోస్‌లో ఇటీవల జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ సమావేశాలకు ఆహ్వానం అందింది. అమెరికా హెండర్సన్‌లో జరగనున్న పర్యావరణ-జలవనరుల సమావేశానికి రావాల్సిందిగా ఇన్విటేషన్ వచ్చింది. మే 21 నుంచి 25 మధ్య జరిగే మీటింగ్స్‌లో ప్రసంగించాలని అమెరికా సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ సంస్ధ కోరింది. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు సహా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలపై కేటీఆర్ ప్రసంగించనున్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విధివిధానాలపై మంత్రి కేటీఆర్ మాట్లాడనున్నారు.
సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ సంస్ధ ప్రతినిధులు తెలంగాణలో పర్యటించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులను సందర్శించారు. ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పాటు ప్రాజెక్టుల నిర్మాణం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేశారంటూ తెలంగాణ ప్రభుత్వంపై ప్రతినిధుల బృందం ప్రశంసలు కురిపించింది. ప్రాజెక్ట్‌లతో తెలంగాణలో కలిగిన సామాజిక, ఆర్ధిక సమానత్వాన్ని ప్రశంసించింది.
అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ నీటి వనరుల సంరక్షణ, పర్యావరణ సమస్యల పరిష్కారంపై కృషి చేస్తోంది. 1852లో ఈ సొసైటీలో 177 దేశాలకు చెందిన సుమారు లక్షా 50 వేలకుపైగా సివిల్ ఇంజినీర్లు సభ్యులుగా ఉన్నారు. గతంలో అమెరికాలో జరిగిన పర్యావరణ-నీటి వనరుల సంస్థ వార్షికోత్సవంలో కేటీఆర్ పాల్గొన్నారు.
2017 మే 22న శాక్రమెంటోలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల విషయంలో అవలంభిస్తున్న విధానం గురించి కేటీఆర్ మాట్లాడారు. ఈ క్రమంలో మరోసారి మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానం మేరకు కేటీఆర్ అంతర్జాతీయ సదస్సులో పాల్గొనే అవకాశముందని తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..