TRS – Minister KTR: టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పీడు పెంచారా? క్షేత్ర స్థాయిలో పర్యటనలకు శ్రీకారం చుట్టేశారా? ఇవాళ నల్గొండ పర్యటనలో.. కాలి నడకన పట్టణమంతా కలియ తిరిగిన కేటీఆర్.. జనంతో మమేకమైన తీరు చూస్తే అది నిజమే అనిపించక మానదు. నల్గొండ టూర్‌లో బిజీబిజీగా గడిపారు మంత్రి కేటీఆర్. ఐటీహబ్ సహా పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన కేటీఆర్.. సహచర మంత్రులతో కలిసి గంటకుపైగా పట్టణంలో పాదయాత్ర చేశారు. దారిపొడవునా పలు దుకాణాల్లోకి వెళ్లి వ్యాపారులను… రోడ్డుపై వెళ్తున్న ప్రజల్ని పలుకరిస్తూ ముందుకు సాగారు. అంతకుముందు, కేటీఆర్‌కు.. స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు బారీ బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు.
ఇటీవల నల్గొండలో పర్యటించిన సీఎం కేసీఆర్.. పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అధికారులకు, స్థానిక నేతలకు దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగానే.. పలు అభివృద్ధి పనులకు ఇవాళ శంఖుస్థాపన చేశారు కేటీఆర్. పట్టణంలోని బీట్ మార్కెట్లో వెజ్ , నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ కు శంకుస్థాపన చేశాక… పట్టణంలో పాదయాత్ర మొదలెట్టిన కేటీఆర్.. మార్కెట్ యార్డు నుంచి ఎన్జీ కళాశాల, జిల్లా పోలీసు కార్యాలయం, క్లాక్ టవర్ సెంటర్ వరకు గంటన్నరకు పైగా కలియ తిరిగారు.
ఎన్జీ కళాశాల సమీపంలో పట్టపగలు వెలుగుతున్న విద్యుత్ దీపాలు, వేలాడుతున్న వైర్లను చూసి.. సంబంధింత అధికారులను, సిబ్బందినీ.. మందలించారు. పట్టణంలో రోడ్లను వెడల్పు చేసే క్రమంలో చెట్లను తొలగించవద్దని.. ప్రైవేట్ స్థలాల యజమానులు సంప్రదించి పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.
పాదయాత్ర చేస్తూ పలు దుకాణాల్లోకి వెళ్లిన కేటీఆర్… వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూనే.. ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పని తీరు ఎలా ఉందంటూ ఆరా తీశారు. క్లాక్ టవర్ సెంటర్ దగ్గరున్న టీ షాష్‌లో చాయ్ తాగిన కేటీఆర్… పాన్ షాప్ లో పాన్ తిన్నారు. వద్దని యజమాని వారిస్తున్నా.. డబ్బులు చెల్లించే ముందుకు కదిలారు కేటీఆర్.
రోడ్డుపై వెళ్తున్న పాదచారులను, బైకర్స్‌ను ఆపి.. సమస్యలు అడిగి తెలుసుకున్న కేటీఆర్.. పట్టణ అభివృద్ధికి ఏం చేయొచ్చో చెప్పాలని సలహాలు అడిగారు. అనూహ్యంగా, క్లాక్ టవర్ సెంటర్లో మంత్రి కేటీఆర్ కాళ్లపై పడ్డారు ఇద్దరు యాచకులు. చంటి పిల్లలతో భిక్షం ఎత్తుకోవద్దని వారికి సూచించారు మంత్రి.
వారికి వెంటనే ఇల్లు మంజూరు చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌కు ఆదేశాలిచ్చారు. ఆ తర్వాత గుండగోని మైసయ్య ఫంక్షన్ హాల్లో జిల్లా ఎమ్మెల్యే లు, మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్ల తో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఇవి కూడా చదవండి: Hyderabad Drug Racket: న్యూ ఇయర్ గ”మ్మత్తు”పై నిఘా కన్ను.. వాటిపైనే టాస్క్ ఫోర్స్ స్పెషల్ ఫోకస్..
Good News: మందుబాబులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్.. న్యూ ఇయర్ కానుకగా బ్రాండెడ్ మద్యం..