Telangana: కాంగ్రెస్‌లో ఊహించని ట్విస్ట్.. సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి కొండా సురేఖ..
మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఆమె శుక్రవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని సీఎంకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పిస్తారనే ఊహాగానాల నేపథ్యంలో ఆమె రేవంత్ ఇంటికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పరకాల నియోజకవర్గ పంచాయితీ, మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తారంటూ జోరుగా సాగుతున్న ప్రచారాల వేళ.. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి కొండా సురేఖ వెళ్లారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా రేవంత్‌కు ఆమె రాఖీ కట్టారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారిపోయింది. వరంగల్ జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న కొండా కుటుంబానికి – సీఎం రేవంత్ రెడ్డికి మధ్య పరకాల నియోజకవర్గం సీటు వ్యవహారం తీవ్ర విభేదాలకు దారితీసింది. కొండా సురేఖ కుమార్తె సుష్మిత పటేల్ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్‌గా ఘాటు వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది.
ఈ పరిణామాలపై అధిష్టానం సైతం అసంతృప్తి వ్యక్తం చేసిందని, సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయంటూ జోరుగా ఊహాగానాలు వెల్లువెత్తాయి. కొండా దంపతులు కాంగ్రెస్‌ను వీడి సొంత దారి చూసుకుంటారా అన్న చర్చ కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి చేరుకున్న కొండా సురేఖ.. రేవంత్ రెడ్డికి స్వయంగా రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వీరిద్దరి మధ్య కొద్దిసేపు తాజా రాజకీయ పరిణామాలు, పరకాల సీటు వివాదంపై ఏకాంత చర్చలు జరిగినట్లు సమాచారం.
వివాదానికి చెక్ పడినట్లేనా?
మంత్రివర్గ విస్తరణ, మార్పుల ప్రచారం జోరందుకున్న వేళ కొండా సురేఖ సీఎం రేవంత్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదానికి ఇక్కడితో తెర పడుతుందా..? లేక కొండా సురేఖపై అధిష్ఠానం చర్యలు తీసుకుంటుంటుందా..? ఆమెను మంత్రి పదవి నుంచి తప్పిస్తుందా..? అన్నది సస్పెన్స్‌గా మారింది.
