Konda Surekha: గాంధీభవన్‌లో కన్నీరుపెట్టిన మంత్రి కొండా సురేఖ

|

Sep 30, 2024 | 6:57 PM

మంత్రి కొండా సురేఖ కన్నీరు పెట్టుకున్నారు. తనపై బీఆర్ఎస్ అభ్యంతరకరమైన రీతిలో ట్రోలింగ్ చేయిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్, కేసీఆర్ ఖబడ్దార్ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Konda Surekha: గాంధీభవన్‌లో కన్నీరుపెట్టిన మంత్రి కొండా సురేఖ
Konda Surekha
Follow us on

తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌పై తీవ్రస్థాయిలో స్పందించారు తెలంగాణ మంత్రి కొండా సురేఖ. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు మంత్రి కొండా సురేఖ మెడలో నూలు దండా వేశారు. దీనిపై కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. అయితే ఇదంతా బీఆర్ఎస్ పనే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కొండా సురేఖ. మహిళనని కూడా చూడకుండా బీఆర్ఎస్ నేతలు దారుణంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ క్రమంలో ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

కవిత జైలులో ఉన్నప్పుడు తాము ఇదే రకంగా ట్రోల్ చేశామా అని ప్రశ్నించారు. మహిళలంటే కేటీఆర్‎కు మొదటి నుంచి చులకనే అని.. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు తనను ఇలాగే అగౌరపరిస్తే ఆ పార్టీ నుండి బయటకు వచ్చానని తెలిపారు. ఇకపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్‎పై సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. అనుచిత పోస్టు పెట్టిన బీఆర్ఎస్‌కు తన శాపం తప్పకుండా తగులుతుందన్నారు.

అంతకుముందు దీనిపై నిరసన తెలిపేందుకు కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ భవన్‌ దగ్గరకు వెళ్లడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణ భవన్‌ దగ్గర బీఆర్‌ఎస్‌ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు యత్నించాయి. అయితే వారిని బీఆర్‌ఎస్‌ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..