వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికో ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై మంత్రి హరీశ్ రావు ఆరా తీశారు. వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రీతి తల్లిదండ్రులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. అయితే.. విషమంగానే ప్రీతి ఆరోగ్య పరిస్థితి ఉందనిృ నిమ్స్ వైద్యులు చెబుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రీతికి వెంటిలేటర్, ఎక్మో సపోర్ట్‌తో వైద్యం అందిస్తున్నారు. ఇక నిమ్స్ లో ప్రీతి కుటుంబ సభ్యులను కలిసిన తర్వాత హరీశ్ రావు కాన్వాయ్‌కి అడ్డుపడ్డారు బీఎస్పీ కార్యకర్తలు. ర్యాగింగ్‌పై నిందితుడికి కఠిన శిక్షలు పడాలని.. అటు కాలేజీ యాజమాన్యంపైనా కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. అందోళన చేసిన కార్యకర్తలను అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ తరలించారు పోలీసులు.
కాగా.. కాకతీయ మెడికల్ కాలేజీ మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో అన్ని సాక్ష్యాలను తాము సేకరించినట్లు వరంగల్ పోలీసు కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ సైఫ్‌ను అరెస్టు చేసినట్టు వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగానే ప్రీతిని సైఫ్ వేధించినట్టు స్పష్టంగా కనిపిస్తోందని పోలీసు కమిషనర్ తెలిపారు. ఈ కేసును ర్యాగింగ్ చట్టం కింద చేపడుతున్నామని కమిషనర్ పేర్కొన్నారు.
వాట్సాప్ గ్రూప్‌లోనూ హేళన చేయడం కూడా ర్యాగింగ్ కిందకే వస్తుంది. ప్రీతిని సైఫ్ వేధించిన సంఘటనలు రెండు మూడు జరిగినట్టు గుర్తించాం. ఆత్మహత్యకు యత్నించిన డాక్టర్ ప్రీతి తెలివైన అమ్మాయి, ధైర్యవంతురాలనే విషయం ఆమె చాట్స్ ద్వారా అర్థమవుతోంది. టాక్సికాలాజీ నివేదిక కోసం ఎదురుచూస్తున్నాం.
– రంగనాథ్, వరంగల్ సీపీ
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..