CM KCR: అమరవీరుల త్యాగాలు నిత్యం స్మరించుకునేలా నిర్మాణం.. అమరజ్యోతిని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

Telangana Martyr's Memorial Inauguration: ఉద్యమ ధ్రువ తారలకు ఘన నివాళులు ఆర్పించే స్మారక చిహ్నాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. హైదరాబాద్‌ నడిబొడ్డున తెలంగాణ సర్కార్‌ అమరవీరుల స్మారకాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. ఈ సందర్భంగా అమరవీరులకు పోలీసులు గన్‌ సెల్యూట్ నిర్వహించారు.

CM KCR: అమరవీరుల త్యాగాలు నిత్యం స్మరించుకునేలా నిర్మాణం.. అమరజ్యోతిని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌
Cm Kcr

Updated on: Jun 22, 2023 | 9:11 PM

హైదరాబాద్, జూన్ 22: అమరుల త్యాగం..అజరామరం, అమరుల స్ఫూర్తి..ప్రజ్వలిత దీప్తి. ఉద్యమ ధ్రువ తారలకు ఘన నివాళులు ఆర్పించే స్మారక చిహ్నాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. హైదరాబాద్‌ నడిబొడ్డున తెలంగాణ సర్కార్‌ అమరవీరుల స్మారకాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. ఈ సందర్భంగా అమరవీరులకు పోలీసులు గన్‌ సెల్యూట్ నిర్వహించారు. అనంతరం అమ‌ర‌వీరుల‌కు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఇత‌ర ప్రజాప్రతినిధులు నివాళుల‌ర్పించారు. నివాళుల్పరించిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి అమర జ్యోతిని సీఎం ప్రారంభించారు. అమ‌ర‌వీరుల‌పై రూపొందించిన ప్రదర్శనను సీఎం కేసీఆర్, ప్రజాప్రతినిధులు, అధికారులు తిల‌కించారు. హైదరాబాద్‌ సెక్రటేరియట్‌ ఎదురుగా మూడున్నర ఎక‌రాల‌ స్థలంలో 150 అడుగుల ఎత్తులో అమ‌రుల స్మార‌కం ఏర్పాటు చేశారు. 178 కోట్ల రూపాయల ఖర్చుతో పూర్తిగా స్టెయిన్‌లెస్ స్టీల్‌తో ప్రమిద‌, దీపం ఆకృతిలో స్మార‌కాన్ని నిర్మించారు.

ప్రజ్వలన దీపం న‌మూనాను తెలంగాన శిల్పి ర‌మ‌ణారెడ్డి రూపొందించారు. ఈ భవనం మొద‌టి రెండు బేస్‌మెంట్లలో 2.15 ల‌క్షల చ‌ద‌ర‌పు అడుగుల్లో పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ప్రదర్శన కోసం స్థలం కేటాయించారు. మొద‌టి అంత‌స్తులో అమ‌రుల ఫొటో గ్యాల‌రీ, మినీ థియేట‌ర్, రెండో అంత‌స్తులో 600 మంది కూర్చునేలా క‌న్వెన్షన్ సెంట‌ర్, మూడు, నాలుగు అంత‌స్తులో చుట్టూ అద్దాల‌తో పైక‌ప్పు నిర్మించారు. సభా వేదిక పై నుంచి అమరవీరులకు నివాళిగా గీతాలాపన జరిగింది. కార్యక్రమానికి వచ్చిన వారంతా క్యాండిల్స్‌తో నివాళి అర్పించారు. లైట్లు ఆర్పేయడంతో బ్యాటరీతో పనిచేసే క్యాండిల్స్‌ కాంతితో సభా ప్రాంగణమంతా వెలుగులీనింది.

అమరవీరులకు నివాళ ఘటిస్తూ గీతాలపన తర్వాత అమరవీరుల కుటుంబాలను సీఎం కేసీఆర్‌ సన్మానించారు. తొలుత శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, సోదరుడిని సత్కరించారు. ఆ తర్వాత పోలీసు కిష్టయ్య కుటుంబాన్ని సత్కరించారు. ఆ తర్వాత ఉద్యమంలో ప్రాణాలు ఆర్పించిన వేణుగోపాల్‌ రెడ్డి కుటుంబసభ్యులను, అసెంబ్లీ ముట్టడి సమయంలో యూనివర్సిటీ ప్రాంగణంలో ప్రాణత్యాగం చేసుకున్న సిరిపురం యాదయ్య కుటుంబాన్ని, ఢిల్లీలో పార్లమెంట్‌ ఎదురుగా ఉరివేసుకొని చనిపోయిన పెద్దమంగళారానికి చెందిన యాదిరెడ్డి కుటుంబాన్ని, తెలంగాణ సాధన కోసం విషం తీసుకొని ప్రాణాలు త్యాగం చేసిన కావలి సువర్ణ కుటుంబాన్ని ముఖ్యమంత్రి సన్మానించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం