Professor Saibaba: ‘ఇది ముమ్మాటికీ కుట్రే..’ ప్రొఫెసర్ సాయిబాబా మృతికి మావోయిస్టుల సంతాపం

|

Oct 15, 2024 | 5:30 PM

మానవతావాది, రచయిత, ప్రజాస్వామిక వాది, బుద్ధి జీవి ప్రొఫెసర్‌ జీఎన్ సాయిబాబా మృతి పట్ల మావోయిస్టు పార్టీ సంతాపం వ్యక్తం చేసింది. సాయిబాబా మృతికి ప్రభుత్వాలే బాధ్యత వహించాలంటూ లేఖ విడుదల చేశారు..

Professor Saibaba: ఇది ముమ్మాటికీ కుట్రే.. ప్రొఫెసర్ సాయిబాబా మృతికి మావోయిస్టుల సంతాపం
Professor Saibaba
Follow us on

హైదరాబాద్‌, అక్టోబర్‌ 15: మానవ హక్కుల కార్యకర్త, ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా మృతిపై మావోయిస్టు పార్టీ సంతాపం ప్రకటించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో మంగళవారం ( అక్టోబర్‌ 15) ఓ లేఖను విడుదల చేశారు. ప్రొఫెసర్ సాయిబాబాను అక్రమంగా పదేళ్లు జైళ్లో పెట్టి హింసించారని ఆ లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల హక్కులను పరిరక్షించడానికి, ప్రజల తరపున గొంతెత్తిన సాయిబాబాను బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు రాజ్యమే పథకం ప్రకారం హత్య చేసింది. బడుగు బలహీన వర్గాల గొంతును ప్రొఫెసర్‌ సాయిబాబా వినిపించారు. ఢిల్లీ ప్రొఫెసర్‌గా కొనసాగుతూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో సాయిబాబా కీలక పాత్ర పోషించారు. 1997 డిసెంబర్‌లో ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరం (ఎఐపిఆర్ఎఫ్ ) ఆధ్వర్యంలో ప్రజాస్వామిక తెలంగాణ కోసం 2 రోజుల సదస్సు జరిగింది. ఈ సభలోనే వరంగల్ డిక్లరేషన్ జరిగింది. ఆ సదస్సుకు జీఎన్ సాయిబాబా నాయకత్వం వహించారు. ఏఐపిఆర్ఎఫ్‌లో కొనసాగుతూ ప్రజల ప్రాథమిక హక్కుల పరి రక్షణకై ఆయన పోరాడారు.

ఫోరం ఎగైనెస్ట్ వార్ ఇన్ పీపుల్స్ వేదికలో క్రియాశీలంగా పని చేస్తూనే.. సామ్రాజ్యవాదుల, కార్పోరేట్ సంస్థల ప్రయోజనాల కోసం దేశ సంపదను, ప్రకృతి వనరులను కొల్లగొట్టడానికి ఆదివాసీలపై సల్వాజుడుం, గ్రీన్ హంట్ పేర్లతో సాగుతున్న పాశవిక దాడులను ఖండించారు. దేశంలో పాశవికంగా కొనసాగుతున్న రాజ్య హింసను ప్రపంచానికి తెలియజేశారు. ప్రజాస్వామిక బద్దంగా ప్రశ్నించడం, ప్రశ్నించే శక్తులను తయారు చేయడం నేరంగా భావించిన ప్రభుత్వం కుట్ర పూరితంగా, మానవ హక్కులను ఉల్లంఘిస్తూ పెగాసస్ వంటి మాల్వేర్ సాఫ్ట్ వేర్ల ద్వారా జీఎస్ సాయిబాబా కంప్యూటర్‌లో చొరబడింది. అందులో మావోయిస్టు సాహిత్యాన్ని చొప్పించి, మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నాడని నిందారోపణ చేసి రాజ్యాంగ విరుద్ధ చట్టాలను అక్రమంగా ఆయనపై మోపారు. ఇక నిర్దోషిని, 90 శాతం అంగవైకల్యంతో కదల్లేని స్థితిలో వీల్ చైర్‌కి మాత్రమే పరిమితమైన జీఎన్ సాయిబాబాను అన్యాయంగా పదేళ్లు ఒంటరిగా అండా సెల్‌లో నిర్బంధించారు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నా ఎలాంటి వైద్య పదుపాయం అందకుండా చేశారు. చివరి దశలో నిర్దోషిగా మహారాష్ట్ర హైకోర్టు తీర్పు ఇస్తే.. ఆ తీర్పును సవాల్ చేస్తూ ఎన్ఐఏ ఆయన విడుదలను అడ్డుకుంది. జైలులో దుర్భర పరిస్థితులను కల్పించి సాయిబాబా ఆరోగ్యం మరింత క్షీణించేలా చేశారు. జైలు పరిస్థితుల కారణంగానే సాయిబాబా ఆరోగ్యం క్షీణించింది. సాయిబాబా మృతికి ప్రభుత్వాలే బాధ్యత వహించాలి’ అంటూ జగన్ పేరిట విడుదలైన మవో లేఖలో డిమాండ్ చేశారు.

కాగా మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో మహారాష్ట్ర పోలీసులు ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబను 2014లో ఢిల్లీలో అరెస్టు చేశారు. ఈ కేసులో దర్యాప్తు పేరిట దాదాపు పదేళ్ల పాటు ఆయనను మహారాష్ట్రలోని నాగపూర్‌లో అండా జైలులో ఉంచారు. అక్కడి దుర్భర పరిస్థితుల కారణంగా ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. బాంబే హైకోర్టు సాయిబాబాను ఈ ఏడాది మార్చిలో నిర్ధోషిగా తేల్చడంతో ఆయన విడుదలయ్యారు. కానీ అప్పటికే ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించడంతో హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి కన్నుమూశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.