
గత కొన్ని రోజులుగా మావోయిస్టులను అంతమొందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భారత్‌ను మావోయిస్టు రహితంగా దేశంగా మారుస్తామని పలు సందర్భాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా అన్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టు సుప్రీం కమాండర్ హిడ్మాతో పాటు భారీగా మావోయిస్టులు కర్రెగుట్టల్లో ఉన్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. ఇందులో భాగంగా ములుగు జిల్లాలోని కర్రెగుట్టల్లో ఉన్న మావోయిస్టులను ఏరిపారేసేందుకు ఆపరేషన్ “కగార్”ను చేపట్టాయి. ఈ ప్రాంతంలో గత మూడు రోజులుగా ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో భద్రత బలగాల ఆపరేషన్‌తో బెదిరిపోయిన మావోయిస్టులు.. కర్రెగుట్టల వద్ద జరుగుతున్న ఆపరేషన్ కగార్‌ను వెంటనే ఆపేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మావోయిస్టు బస్తర్ ఇన్‌ఛార్జ్ రూపేష్ పేరుతో లేఖను విడుదల చేశారు.
శాంతి చర్చలకు ముందుకు రావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు. చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని. ఒక నెల సైనిక చర్య వాయిదా వేసి చర్చలకు జరపాలని మావోయిస్టులు విడుదల చేసిన లేఖలో రాసుకొచ్చారు.
అయితే కర్రెగుట్టలో జరుగుతున్న ఆపరేషన్ కగార్‌ను నిలిపి వేయాలని శాంతి చర్చలకు ముందుకు రావాలన్న మావోయిస్టుల లేఖపై
అటు పోలీసులు కానీ.. భద్రతా బలగాలు కానీ ఇంకా స్పందించలేదు. ఇటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా శాంతి చర్చలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ప్రస్తుతం ములుగు జిల్లాలోని కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్ కొనసాగుతూనే ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…