Hyderabad: మణికొండలో ట్రాఫిక్ కష్టాలు.. రహదారి విస్తరణ కోసం స్థానికులు ప్రజా వాకథాన్!
హైదరాబాద్ నగరంలో కేవలం ప్రధాన రహదారులే కాదు కాలనీల్లో ఉండే చిన్న దారుల వెంబడి కూడా ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోతున్నాయి. తాజాగా మణికొండలోనూ ట్రాఫిక్ ఇబ్బందులు పెరిగిపోవడంతో రోడ్డు విస్తరణ చేపట్టి.. ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి కలిగించాలని స్థాసినికలు డిమాండ్ చేస్తున్నారు.

హైదరాబాద్, ఆగస్ట్ 22: మణికొండ లోని మర్రిచెట్టు నుండి ఓయూ కాలనీ ప్రధాన రహదారిపై రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ మణికొండ ప్రజా ఐక్య వేదిక ఆధ్వర్యంలో శనివారం ప్రజా వాకథాన్ నిర్వహించారు. మర్రిచెట్టు నుంచి శివాలయం, హనుమాన్‌నగర్, శ్రీనివాస కాలనీ, పంచవటి కమాన్, ట్రైల్స్, భాగ్యలక్ష్మి కాలనీ రోడ్డు, కనకదుర్గమ్మ ఆలయం మీదుగా ఆదిత్య అథీనా వరకు ఈ ధర్నా నిర్వహించారు.
మర్రిచెట్టు, శివాలయం, హనుమాన్‌నగర్, శ్రీనివాస కాలనీ, పంచవటి కమాన్, ట్రైల్స్ ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ రద్దీతో స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ప్రజా ఐక్య వేదిక ప్రతినిధులు తెలిపారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం 80 అడుగుల రహదారి విస్తరణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. రహదారి విస్తరణకు అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను తరలించాలని, ప్రధాన రహదారిపై అక్రమ పార్కింగ్‌ను నియంత్రించాలని కోరుతున్నారు.
అదే విధంగా పంచవటి కాలనీ రోడ్ నంబర్ 10 వద్ద నిర్మించిన బాక్స్ డ్రెయిన్–కమ్–రోడ్డును వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్యను తాత్కాలిక చర్యలతో కాకుండా శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించేందుకు అధికారులు సమగ్ర చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ప్రజా సమస్య పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ఈ వాకథాన్‌కు ఎలాంటి రాజకీయ సంబంధం లేదని నిర్వాహకులు స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా పాల్గొని తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని మణికొండ ప్రజా ఐక్య వేదిక పిలుపునిచ్చింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
