Numerology: ఈ తేదీల్లో పుట్టినవారికి జీవితంలో విజయం ఈజీగా రాదు.. కాస్త కష్టపడాల్సిందేనట..!
సంఖ్యాశాస్త్రం ప్రకారం పుట్టిన తేదీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా 4, 8 మూలాంకాలకు చెందినవారు జీవితంలో విజయాలను సాధించేందుకు మరింత కష్టపడాల్సి ఉంటుందని నమ్ముతారు. ఏ నెలలోనైనా 4, 13, 22, 31 తేదీల్లో పుట్టినవారిని మూలాంకం 4గా, 8, 17, 26 తేదీల్లో పుట్టినవారిని మూలాంకం 8గా పరిగణిస్తారు. ఈ తేదీల్లో జన్మించినవారి స్వభావం, కెరీర్‌లో ఎదురయ్యే సవాళ్లు, విజయాన్ని సాధించేందుకు అవసరమైన పట్టుదల గురించి సంఖ్యాశాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోండి.

సంఖ్యాశాస్త్రంలో పుట్టిన తేదీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని నమ్ముతారు. వ్యక్తి పుట్టిన తేదీ ఆధారంగా వచ్చే మూలాంకం వారి స్వభావం, ఆలోచనా విధానం, జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు, విజయాన్ని సాధించే విధానం గురించి కొన్ని సంకేతాలు ఇస్తుందని సంఖ్యా శాస్త్ర నిపుణులు చెబుతారు. ఈ క్రమంలో మూలాంకం 4, 8 ఉన్నవారికి జీవితంలో విజయాలు అంత సులభంగా లభించవని నమ్ముతారు. జీవితంలో తమ లక్ష్యాలను చేరుకోవడానికి వీరు ఇతరుల కంటే ఎక్కువగా శ్రమించాల్సి రావచ్చని, ఓర్పు, పట్టుదలతో ముందుకు సాగాల్సి ఉంటుందని భావిస్తారు.
8, 17, 26 తేదీల్లో పుట్టినవారు
ఏ నెలలోనైనా 8, 17 లేదా 26వ తేదీన జన్మించిన వారి మూలాంకం 8గా పరిగణిస్తారు. సంఖ్యాశాస్త్రంలో 8వ సంఖ్యకు శని గ్రహంతో సంబంధం ఉందని చెబుతారు. శని అంటే కష్టపడి పనిచేయడం, క్రమశిక్షణ, బాధ్యత, కర్మ వంటి అంశాలకు ప్రతీకగా భావిస్తారు. మూలాంకం 8 ఉన్నవారికి జీవితంలో విజయాలు కొంత ఆలస్యంగా లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా కెరీర్ ప్రారంభ దశలో ఎక్కువ బాధ్యతలు, సవాళ్లు ఎదురుకావచ్చని చెబుతారు.
ఎంత కష్టపడినా వెంటనే ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో నిరుత్సాహపడకుండా లక్ష్యంపై దృష్టి పెట్టి నిరంతరం ప్రయత్నం కొనసాగిస్తే.. విజయం తథ్యమని సంఖ్యాశాస్త్రం సూచిస్తుంది. అయితే ఒకసారి విజయం సాధించిన తర్వాత అది స్థిరంగా ఉండే అవకాశం ఉందని సంఖ్యాశాస్త్ర విశ్లేషణలు పేర్కొంటాయి. అందుకే ఈ సంఖ్యను కష్టం, ఓర్పు, క్రమశిక్షణతో అనుసంధానిస్తారు.
4, 13, 22, 31 తేదీల్లో పుట్టినవారు
ఏ నెలలోనైనా 4, 13, 22 లేదా 31వ తేదీన పుట్టినవారి మూలాంకం 4గా పరిగణిస్తారు. అంకశాస్త్రంలో 4వ సంఖ్యకు రాహువుతో సంబంధం ఉందని చెబుతారు. మూలాంకం 4 ఉన్నవారికి కెరీర్ లేదా జీవిత లక్ష్యాలను చేరుకునే సమయంలో అనేక అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉందని సంఖ్యాశాస్త్ర విశ్వాసాలు చెబుతున్నాయి. ఒకే లక్ష్యాన్ని సాధించేందుకు పలుమార్లు ప్రయత్నించాల్సి రావచ్చు. కొన్నిసార్లు పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలను మార్చుకోవాల్సి రావచ్చు. అయితే ఇలాంటి వ్యక్తులు సులభంగా వెనక్కి తగ్గరని, పట్టుదలతో ముందుకు సాగుతారని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతారు.
విజయానికి కొంత సమయం పట్టినా ఎదురయ్యే అనుభవాల నుంచి నేర్చుకుంటూ నిరంతరం ప్రయత్నిస్తే లక్ష్యాన్ని చేరుకోవచ్చని భావిస్తారు. అందుకే మూలాంకం 4 ఉన్నవారికి ఓర్పు, పట్టుదల, పరిస్థితులకు అనుగుణంగా మారే సామర్థ్యం ముఖ్యమని చెబుతారు.
గమనిక: ఈ కథనంలోని సంఖ్యాశాస్త్ర సంబంధిత అంశాలు, సాధారణ విశ్వాసాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడ్డాయి. వీటిని శాస్త్రీయంగా నిరూపితమైన వాస్తవాలుగా పరిగణించకూదు. ముఖ్యమైన జీవిత నిర్ణయాలను వీటి ఆధారంగా మాత్రమే తీసుకోకండి.




