ఇంత దౌర్జన్యమా..? మహిళా రైతుపై తోపుడుబండ్ల వ్యాపారుల దాడి.. మామిడి పండ్లు రోడ్డుపాలు!

కష్టపడి పండించిన పంటను నేరుగా వినియోగదారులకు తక్కువ ధరకే అమ్ముకుందామనుకున్న ఒక మహిళా రైతుకు ఊహించని చేదు అనుభవం ఎదురైంది. వ్యాపార సిండికేట్ పేరిట కొందరు తోపుడుబండ్ల వ్యాపారులు ఆమెపై దౌర్జన్యానికి దిగి, మామిడి పండ్లను నడిరోడ్డుపై పారబోసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో తీవ్ర కలకలం రేపింది. అసలేం జరిగిందంటే?..

ఇంత దౌర్జన్యమా..? మహిళా రైతుపై తోపుడుబండ్ల వ్యాపారుల దాడి.. మామిడి పండ్లు రోడ్డుపాలు!
Woman Farmer Attacked

Edited By:

Updated on: May 18, 2026 | 5:16 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో దారుణం జరిగింది. సొంతంగా పండించిన మామిడి పండ్లను తక్కువ ధరకు విక్రయిస్తోన్న ఓ మహిళా రైతుపై కొందరు తోపుడుబండ్ల వ్యాపారులు దౌర్జన్యానికి దిగారు. మణుగూరు ప్రాంతానికి చెందిన ఓ మహిళా రైతు తాను సొంతంగా పండించిన మామిడి పండ్లను తీసుకువచ్చి, స్థానిక రహదారి పక్కన విక్రయిస్తోంది. మార్కెట్ ధర కంటే ఆమె తక్కువ ధరకు నాణ్యమైన పండ్లను అందిస్తుండటంతో కొనుగోలుదారులు ఆమె వద్దకు రావడం ప్రారంభించారు. ఇది గమనించిన కొందరు స్థానిక చిరు వ్యాపారులు అక్కడికి చేరుకుని ఆమెతో గొడవకు దిగారు. తమ అనుమతి లేకుండా, తాము నిర్ణయించిన ధర కంటే తక్కువకు ఇక్కడ ఎలా అమ్ముతావంటూ సదరు మహిళా రైతును బెదిరించారు.

ఇక్కడ వ్యాపారం చేయాలంటే మా యూనియన్‌లో సభ్యత్వం ఉండాలి, డబ్బులు చెల్లించాలి.. లేదంటే కుదరదు అంటూ వారు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో గొడవ పెద్దది కావడంతో ఆగ్రహానికి గురైన వ్యాపారులు, మహిళా రైతు అమ్మకానికి పెట్టిన మామిడి పండ్లన్నింటినీ రోడ్డుపై పారబోసి వీరంగం సృష్టించారు. కళ్లముందే తను కష్టపడి తెచ్చిన పంట రోడ్డుపాలవడంతో ఆ మహిళ తీవ్ర ఆవేదనకు గురైంది. ఈ దౌర్జన్యాన్ని చూసి స్థానికులు సదరు వ్యాపారులను నిలదీయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ సందర్భంగా సదరు వ్యాపారులు పోలీసులతో సైతం వాగ్వాదానికి దిగి, తమ యూనియన్ నిబంధనల గురించే మాట్లాడటం గమనార్హం. దీనిపై పోలీసులు తీవ్రంగా స్పందిస్తూ..ఎవరైనా, ఎక్కడైనా స్వతంత్రంగా వ్యాపారం చేసుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది. యూనియన్ల పేరిట దౌర్జన్యాలు చేసి, గొడవలు సృష్టిస్తే కఠినమైన కేసులు నమోదు చేస్తాం అని హెచ్చరించడంతో వ్యాపారులు వెనక్కి తగ్గారు. ఈ ఘటనలో స్థానికులు సదరు మహిళా రైతుకు అండగా నిలిచారు. దళారీలు, వ్యాపారుల దోపిడీ లేకుండా నేరుగా తక్కువ ధరకు పండ్లను విక్రయించే రైతులపై ఇలాంటి దౌర్జన్యాలు చేయడం సరికాదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us