తెలుగు రాష్ట్రాలపై ‘మాండూస్’ తుఫాన్ ప్రభావం తీవ్రంగానే ఉంది. శుక్రవారం తమిళనాడు తీరం దాటిన ఈ తుఫాన్ ప్రభావంతో హైదరాబాద్ శివార్లలో శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకూ అడపాదడపా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఫలితంగా పగటి పూట ఉష్ణోగ్రతలు మరింత తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజధాని హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో నెలకొన్న చల్లటి వాతావరణానికి చీకటి మేఘాలు, చినుకులు తోడయ్యాయి. అసలే చలి, పైగా వర్షం కావడంతో చాలా మంది ప్రజలు ఇంట్లోనే ఉండేందుకు ఇష్టపడుతున్నారు.
అయితే ఆదివారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ, లక్డీకాపూల్, నాంపల్లి, కోఠీ, సుల్తాన్ బజార్, సైదాబాద్, చంపాపేట్, సరూర్‌నగర్, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇదిలావుండగా రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (IMD) అంచనా వేసింది. మరోవైపు హైదరాబాద్ కేంద్రం ప్రకారం తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
కాగా, తమిళనాడు తీరాన్ని దాటిన తర్వాత మాండూస్ అల్పపీడనంగా బలహీనపడింది. ఫలితంగా హైదరాబాద్ సహా ఉభయ రాష్ట్రాలలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే అల్పపీడనంగా మారిన మాండూస్ ఉత్తర అంతర్గత తమిళనాడు దానికి ఆనుకుని ఉన్న దక్షిణ అంతర్గత కర్ణాటక, ఉత్తర కేరళ వైపుగా కదులుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..