మంచిర్యాల, ఆగస్టు25: అమ్మంటే ఎవరికైనా ప్రాణమే.. అమ్మే లేకుంటే ఈ జన్మ లేదు.. అలాంటి తల్లి ప్రాణపాయంలో ఉంటే.. ఇక బతకదని తెలిస్తే.. ఆ కన్నతల్లిని కాపాడుకునేందుకు ఏ కొడుకైనా ఎంతంటి సాహసానికైనా దిగుతాడు. అలాంటి ఓ కొడుకు చేసిన ఓ పని ఇప్పుడు సర్వత్ర చర్చని అంశం అవుతోంది. ఆంద్రప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి తన తల్లిని తిరిగి బతికించుకునేందుకు వందల కిలో మీటర్లు ప్రయాణించి మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి చర్చికి చేరుకున్నాడు. మృతదేహాన్ని చర్చి ముందు ఉంచి పాస్టర్ ను తన తల్లిని బతికించాలంటూ వేడుకున్నాడు. కానీ, ఆ చర్చి నిర్వాహకులు మాత్రం ఆ వ్యక్తిని అతను తీసుకొచ్చిన మృతదేహాన్ని చర్చిలోకి అనుమతించలేదు. పాస్టర్ లేడంటూ లోనికి అనుమతి లేదంటూ అతనిని బయటకు వెళ్లగొట్టారు. కానీ ఆ వ్యక్తి మాత్రం పాస్టర్ వచ్చేంత వరకు ఇక్కడి నుండి కదిలేదే లేదంటూ మొండి పట్టు పట్టి.. దాదాపు మూడు గంటల పాటు ఆ చర్చి ముందే పడిగాపులు కాసాడు. నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చేసేది లేక తల్లి మృతదేహంతో సొంత ఊరికి పయనమయ్యాడు ఆ వ్యక్తి. ఈ ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లోని కల్వరి చర్చ్ ఎదుట జరిగింది.
కల్వరి చర్చి పాస్టర్ ప్రవీణ్ పై అత్యంత నమ్మకం పెంచుకున్న రాజమండ్రి కి చెందిన ఓ వ్యక్తి తన తల్లిని తిరిగి బ్రతికించుకునేందుకు హైదరాబాద్ లోని ఆస్పత్రి నుండి బెల్లంపల్లికి బయలుదేరాడు. అయితే మార్గమధ్యలోనే తల్లి చనిపోవడంతో ఆ తల్లిని ఎలాగైనా పాస్టర్ ప్రవీణ్ బతికిస్తాడని తను ప్రార్థనలు చేస్తే చనిపోయిన వారు కూడా తిరిగి వస్తారని మూఢనమ్మకంతో బెల్లంపల్లికి చేరుకున్నాడు. తన తల్లి మణికుమారి చనిపోయిందని పాస్టర్ ప్రవీణ్ ప్రార్థనలు చేస్తే తన తల్లి తిరిగి బతుకుతుందంటూ.. ఒక్కసారి ఒకే ఒక్కసారి పాస్టర్‌ను కల్పించాలంటూ చర్చి నిర్వహకులను వేడుకున్నాడు. అయితే ఆయన మాటలతో షాక్ క్ గురైన నిర్వహకులు పాస్టర్ ప్రవీణ్ అపాయింట్మెంట్ దొరకదని.. ఆదివారం తప్ప మిగిలిన రోజులు పాస్టర్ ను కలవడం కుదరదని అక్కడినుంచి వెళ్ళిపోవాలంటూ నిర్వహకులు సూచించారు.
సదరు వ్యక్తి మాత్రం పాస్టర్ పై అమితమైన నమ్మకంతో ఇక్కడివరకు వచ్చానని.. నిత్యం టీవిల్లో లైవ్ లో పాస్టర్ ప్రవీణ్ వందల మందిని స్వస్త పరచడం చూశానని.. తన తల్లిని సైతం బ్రతికించాలని వేడుకున్నాడు. తాను ఇంజనీర్ నని.. అయినా దేవుడిపై నమ్మకం తో పాస్టర్ ప్రవీణ్ పై అపారనమ్మకంతో ఇక్కడ వరకు వచ్చానని చెప్పాడు. ఎందరు ఎంతగా నచ్చజేప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆ వ్యక్తి అక్కడినుంచి వెళ్లకపోవడంతో ఇక లాభం లేదనుకున్న కల్వరి చర్చ్ నిర్వాహకులు స్థానికుల సాయంతో అతన్ని అక్కడి నుండి వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు. అయినా కూడా ఫలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో నిరాశతో వెను తిరిగాడు ఆ వ్యక్తి.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..