కరీంనగర్ జిల్లాలో ఓ భూ తగాదా వ్యక్తి ప్రాణాలు బలిగొంది. చొప్పదండి మండలంలోని భూపాలపట్నంలో బొడిగే శ్యామ్ అలియాస్ శంబయ్య ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ సీఐ గోపి కారణమంటూ సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు శంబయ్య. భూపాలపట్నం గ్రామానికి చెందిన బొడిగే శ్యామ్, అలియాస్ శంబయ్య రియల్ ఎస్టేట్ బ్రోకర్. భూపాలపట్నంలో బొడిగే శ్యామ్ 40 గుంటల భూమిని మధ్యవర్తిగా ఉండి సెంట్రల్ ఇంటెలిజెన్స్ సీఐ గోపికి 45 లక్షల రూపాయలకు విక్రయించారు. కొన్ని నెలల తర్వాత ఆ భూమికి వాల్యూ పెరగడంతో 60 లక్షలకు సీఐ అనుమతితో మధ్యవర్తిగా ఉండి బొడిగే శ్యామ్ ఇతరులకు కొనిపించారు.
ఇక్కడి వరకూ భాగానే ఉంది. ఆ పైనే అసలు ట్విస్ట్ మొదలైంది. భూమి కొన్నవారు 5 లక్షలు అడ్వాన్సు ఇచ్చి, మిగతా డబ్బుకు 40 రోజుల తర్వాత ఇస్తామని అగ్రిమెంట్ రాసుకున్నారు. ఐతే అనుకున్న సమయానికి పార్టీ డబ్బులు చెల్లించలేదు. దాంతో భూమి కొనుగోలులో మధ్యవర్తిగా ఉన్న బొడిగే శ్యామ్‌కు, సీఐ గోపి ఫోన్ చేసి డబ్బు కావాలని టార్చర్ పెట్టారు. రేపు, ఎల్లుండి అంటూ వాయిదా వేస్తూ వచ్చిన శ్యామ్, ఇక సీఐ వేధింపులు భరించలేక పోయాడు.
భూమి కొన్న మధ్యవర్తులు కూడా మరింత డిలే చేయడంతో సీఐ వేధింపులు తట్టుకోలేకపోయాడు బొడిగే శ్యామ్. ఇంట్లోనే ఫ్యాన్‌కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు సీఐ గోపియే కారణమని రాశాడు. అంతేకాదు…అగ్రిమెంట్ డీల్‌లో పాల్గొన్న తన బావను కూడా సీఐ దూషించాడని తెలిపాడు. అమ్మను సరిగ్గా చూసుకోవాలని పిల్లలకు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. తనను తీవ్రంగా వేధించిన సీఐ గోపీపై జిల్లా ఎస్పీ, కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం