
సినిమా కథను మరిపించే థ్రిల్లింగ్ క్రైమ్ స్టోరీ ఇది.. హౌస్ లోన్ మాఫీ కోసం ప్రియుడితో కలిసి తన భర్తను ఖతర్నాక్ స్కెచ్ వేసి చంపించిన మాయలేడి రియల్ సీన్ ఇది.. భర్తను చంపించి ఆ శవం వద్ద లబోదిబోమంటూ బోరన విలపించిన ఆ భార్యే.. అసలు హంతుకురాలని ఖాకీలు తేల్చడంతో అంతా షాకయ్యారు.. తన భర్త మరణాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి పోలీసులను తండా వాసులను బురిడీ కొట్టించే ప్రయత్నాలు చేసి.. అటు ప్రియురాలు.. ఇటు ప్రియుడు కటకటాల పాలయ్యారు.. నేరస్తులు కటకటాల పాలవ్వడంతో మహబూబాబాద్ జిల్లాలో రెండు రోజుల హై టెన్షన్ కు తెరపడింది..
వివరాల ప్రకారం.. ఈనెల 22వ తేదీన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బోడమంచతండా సమీపంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. వీరన్న అనే కౌలు రైతు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రోడ్డు పక్కన డెడ్ బాడీ.. ఆ డెడ్ బాడీ పైన బైక్ పడేసి ఉంది.. బైక్ తనపైన పడడంతో ఛాతీలో బలమైన దెబ్బలు తగిలి చనిపోయినట్లు సీన్ క్రియేట్ చేశారు.. సీన్ చూస్తే ఎవరైనా ఇది యాక్సిడెంట్ అని అనుకునేలా.. ఎవ్వరికీ అనుమానం రాకుండా క్రియేట్ చేశారు.. కానీ పక్కనే రక్తపు మరకలు.. ఎక్కడో అతన్ని చంపి పొలంలోకి ఈడ్చుకువచ్చి పడేసిన రక్తపు మరకలు అనుమానాలకు దారి తీసాయి. ఇది పక్కా పథకం ప్రకారం జరిగిన హత్య అని అంతా భావించారు..
మృతుడు ఇదే తండాకు చెందిన భూక్యా వీరన్న అని తెలియడంతో అతని భార్య విజయ, కుటుంబ సభ్యులు బోరున విలపించారు.. డెడ్ బాడీ వద్ద మృతుడి భార్య రోదనలు చూసి అంతా కన్నీళ్లు పెట్టారు. తన భర్తను చంపిన వారిని వదిలిపెట్టవద్దని.. ఎవరో పక్కా ప్రకారం హత్య చేశారని చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని మీడియా ముందు పోలీసుల వద్ద తన ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు.. బోరున విలపిస్తూ తన భర్త మరణంపైన అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది..
ఈ హత్య తండాలో అగ్గి రాజుకునేలా చేసింది.. తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.. వీరన్న హత్యకు RMP భరత్ కారణమనే అనుమానంతో అతని బైక్ దగ్దం చేశారు.. హాస్పిటల్ లోని ఫర్నిచర్ మొత్తం దగ్దం చేశారు.. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో తండాలో పోలీసులు భారీగా మోహరించారు.
అక్కడ ఉన్న సీన్ పరిశీలించిన పోలీసులు ఇది కచ్చితంగా హత్యని ఒక ధ్రువీకరణకు వచ్చారు.. టెక్నాలజీ ఆధారంగా పోలీసులు నిందితులను ఇట్టే పట్టేశారు.. కేవలం 24 గంటల వ్యవధిలోనే మృతుడి భార్య విజయ, ఆమె ప్రియుడు బాలాజీ ఇదే గ్రామానికి చెందిన ఆర్.ఎం.పి భరత్ ఈ ముగ్గురే అసలు నిందితులని తేల్చారు.. ఇన్సూరెన్స్ ద్వారా హౌస్ లోన్ డబ్బులు మాఫీ కోసం ఇంతటి దారుణానికి ఒడిగట్టినట్లు గుర్తించారు..
అయితే మృతుడు వీరన్న కొన్ని అప్పులు చేశాడు.. అప్పు తీర్చడం కోసం తన భూమి అమ్మినా తీరలేదు.. ఈ క్రమంలో విజయ ఇదే గ్రామానికి చెందిన బాలాజీ అనేవ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది.. అతను కూడా కొంత అప్పు ఇచ్చాడు.. ఈ క్రమంలో గూడూరు మండలం రాజనపల్లి గ్రామానికి చెందిన ఆర్ఎంపి భరత్ వీరికి ఒక సలహా ఇచ్చాడు.. ఒక ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో హౌస్ లోన్ ఇప్పించాడు.. అప్పు తీసుకున్న వ్యక్తి ప్రమాదంలో చనిపోతే హౌసింగ్ లోన్ మాఫీ అవుతుందని సలహా ఇచ్చాడు.. ఇదే అదునుగా భావించిన వీరన్న భార్య విజయ ఆమె ప్రియుడు బాలాజీ పక్కా ప్లాన్ వేశారు.. వీరన్నను హతమార్చితే హౌజ్ లోన్ మాఫీ అవుతుంది.. వివాహేతర సంబంధానికి ఎవరూ అడ్డు ఉండరని భావించి ఆర్ఎంపి భరత్ తో కలిసి హతమార్చారని మహబూబాబాద్ DSP తిరుపతిరావు తెలిపారు.
ఈ ముగ్గురి అరెస్ట్ తో కాస్త ఉద్రిక్తతలు చల్లబడ్డాయి. భర్తను చంపించిన భార్య ఆడిన నాటకం చూసి అంతా నివ్వెరపోయారు.. చివరకు నిందితులు పట్టుబడటంతో గ్రామంలో పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..