Bhongir Ticket: ఆ ఎంపీ స్థానానికి బీఆర్ఎస్‌లో కొత్త డిమాండ్.. గులాబీ ఫ్లాన్ వర్కౌట్ అయ్యేనా..?

లోక్‌సభ ఎన్నికల నగారా మోగినా.. ఇంకా భువనగిరి బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపిక చేయకపోవడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే భువనగిరిపై బీఆర్ఎస్ ఫోకస్ పెంచిందట. ఉద్యమ నేతలకే టికెట్ ఇవ్వాలనే డిమాండ్ వస్తుందటంతో టికెట్ కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య క్రమంలో పెరుగుతుందట. లేదంటే భువనగిరి నుండి బీఆర్ఎస్ మళ్ళీ బీసీ అభ్యర్థినే బరిలోకి దింపుతుందా..?

Bhongir Ticket: ఆ ఎంపీ స్థానానికి బీఆర్ఎస్‌లో కొత్త డిమాండ్.. గులాబీ ఫ్లాన్ వర్కౌట్ అయ్యేనా..?
Brs

Edited By: Balaraju Goud

Updated on: Mar 20, 2024 | 9:01 PM

లోక్‌సభ ఎన్నికల నగారా మోగినా.. ఇంకా భువనగిరి బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపిక చేయకపోవడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే భువనగిరిపై బీఆర్ఎస్ ఫోకస్ పెంచిందట. ఉద్యమ నేతలకే టికెట్ ఇవ్వాలనే డిమాండ్ వస్తుందటంతో టికెట్ కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య క్రమంలో పెరుగుతుందట. లేదంటే భువనగిరి నుండి బీఆర్ఎస్ మళ్ళీ బీసీ అభ్యర్థినే బరిలోకి దింపుతుందా..? రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చి కొత్త ప్రయోగం చేస్తుందా..? భువనగిరి బీఆర్ఎస్ టికెట్ కోసం పోటీ పడే పడేది ఎవరు..? దక్కేది ఎవరికి..? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

అసెంబ్లీ ఎన్నికల్లో చేజారిన ఉమ్మడి నల్లగొండ జిల్లా గులాబీ కోటపై పట్టు సాధించేందుకు పార్లమెంట్ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. గెలుపు గుర్రాలకే టికెట్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ తీవ్ర కసరత్తు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఆశించిన ఫలితాలు  రాకపోవడంతో, దానిని ఆనుకుని ఉన్న భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈసారి నల్గొండ, భువనగిరి పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయడం బీఆర్ఎస్ కు సవాల్ గా మారింది. ఎంపీ టికెట్ కోసం ఆశావహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

భువనగిరి నుంచి తొలుత మాజీ ఎమ్మెల్యే ఫైళ్ళ శేఖర్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి పోటీ చేయాలని భావించారు. కానీ పార్టీలోని అంతర్గత రాజకీయాలతో తాను పోటీకి దూరంగా ఉంటున్నట్టు అమిత్ ప్రకటించారు. దీంతో ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, జిట్టా బాలకృష్ణా రెడ్డి, క్యామ మల్లేష్ భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ను ఆశిస్తున్నారు. ఈసారి భువనగిరి టికెట్ ఉద్యమ కారులకు ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోందట. దీంతో తెలంగాణ ఉద్యమ కారుడిగా జిట్టా బాలకృష్ణారెడ్డికి మంచి పేరు ఉంది. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత జిట్టా ఆ పార్టీ యువజన విభాగానికి అధ్యక్షుడిగా పనిచేశారు. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండి ఉద్యమంలో కీలకంగా పని చేశారు.

అయితే 2009లో పొత్తులో భాగంగా భువనగిరి టికెట్ టీడీపీకి కేటాయించారు. దీంతో ఆ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన జిట్టా రెండో స్థానంలో నిలిచారు. తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరిన జిట్టా వైఎస్సార్ మరణంతో ఆ పార్టీకి సైతం రాజీనామా చేశారు. 2014లోనూ భువనగిరి అసెంబ్లీకి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. YSRCPలోనూ కొంతకాలం పని చేసిన జిట్టా.. ఆ తర్వాత యువ తెలంగాణ పార్టీ స్థాపించారు. 2018లో బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా భువనగిరి నుంచి పోటీ చేసినప్పటికీ గెలుపు అందుకోలేకపోయారు. 2022లో యువ తెలంగాణ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నియమితులైన కిషన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ నుంచి సస్పెండ్ వేటుకు గురయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. భువనగిరి కాంగ్రెస్‌ టికెట్ ఆశించి భంగపడిన జిట్టా బీఆర్ఎస్‌లో చేరిపోయారు.

జిట్టా బాలకృష్ణారెడ్డి బీఆర్ఎస్‌లో చేరిక సమయంలో భువనగిరి ఎంపీ టికెట్ ఇస్తామని గులాబీ పెద్దలు హామీ ఇచ్చారట. దీంతో ఎంపీ టికెట్ ఉద్యమ నేతల కోటాలో జిట్టాకు ఇవ్వాలని పార్టీలో కొందరు డిమాండ్ చేస్తున్నారట. ఇప్పటికే సీనియర్ నేతలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్, బిజెపిలలో చేరుతున్నారు. టికెట్ల ఎంపికలో ఉద్యమ నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా పార్టీ క్యాడర్‌కు భరోసా ఇచ్చినట్లు అవుతుందని గులాబీ పెద్దలు భావిస్తున్నారట. నల్లగొండ నుంచి ఉద్యమ నేత డాక్టర్ చెరుకు సుధాకర్, భువనగిరి నుంచి జిట్టా బాలకృష్ణారెడ్డిలకు ఎంపీ టికెట్లు ఇవ్వాలని ఉద్యమ నేతలు గులాబీ పెద్దలను కోరుతున్నారట. ఉద్యమ సమయంలో ఆటుపోట్లను ఎదుర్కొన్న వారికి టికెట్ ఇవ్వడం ద్వారా ఉద్యమ నేతలకు కూడా గౌరవించినట్లు అవుతుందని పార్టీలో కొందరు నేతలు చెబుతున్నారట.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా 2014లో జరిగిన ఎన్నికల్లో భువనగిరి నుంచి బీఆర్ఎస్ ఎంపీగా బూర నర్సయ్య గౌడ్ విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి పోటీ చేసిన బూర నర్సయ్య గౌడ్ ఓటమి పాలయ్యారు. భువనగిరి ఎంపీ స్థానాన్ని బీఆర్‌ఎస్‌ గత రెండు సార్లు బీసీకే ఇవ్వడంతో ఈసారి కూడా అదే ఫార్ములా అమలు చేస్తుందా లేదా అన్నది సస్పెన్స్‌గా ఉంది. గతానికి భిన్నంగా ఈసారి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దింపి కొత్త ప్రయోగం చేస్తుందా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు, నల్లగొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరి నుండి బూడిద బిక్షమయ్యగౌడ్‌లను బరిలోకి దించాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు సమాచారం. చూడాలి మరీ అధినేత మనసులో ఎముందో..? చివరికి పార్టీ బీ ఫామ్ ఎవరికి దుక్కుతుందో..?

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…