
ఏఐఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ వరుసగా ఐదోవసారి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి మాధవీలతను మూడు లక్షల ఓట్ల తేడాతో ఓడించారు. అసదుద్దీన్ ఒవైసీ తన విజయం తర్వాత పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఒవైసీ మరోసారి తమ కంచుకోట హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఘన విజయం సాధించారు. మాధవీ లత గట్టి పోటీ ఇచ్చినప్పటికీ.. హైదరాబాద్ ప్రజలు ఆయనకే జై కొట్టారు. కాగా, దాదాపు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఈ స్థానంలో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల మధ్య గట్టి పోటీ ఉండేది.
అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ స్థానం నుంచి ఐదోసారి విజయం సాధించి రికార్డు సృష్టించారు. బీజేపీ అభ్యర్థి మాధవి లతతో ఆయన పోటీ నెలకొంది. ఒవైసీ 3 లక్షల 38 వేల 87 ఓట్ల తేడాతో మాధవి లతపై విజయం సాధించారు. అసదుద్దీన్ ఒవైసీకి 6 లక్షల 61 వేల 981 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థికి 3 లక్షల 23 వేల 894 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు చెందిన మహ్మద్ వలీవుల్లా సమీర్ 62 వేల 962 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.
విజయం తర్వాత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. ‘… ఐదోసారి మజ్లిస్‌కు విజయాన్ని అందించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్ ప్రజలకు, ముఖ్యంగా మహిళలు, యువతకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు.
#WATCH | AIMIM chief and party's candidate from Hyderabad, Asaduddin Owaisi says, "…I would like to thank the people as they have given the success to Majlis for the fifth time. I would like to thank the people of Hyderabad, especially the youth, women, and first-time… pic.twitter.com/h5CEveilKJ
— ANI (@ANI) June 4, 2024
హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసిన 26 మంది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఇక్కడ విశేషం ఏమంటే, నోటాకు 2 వేల 906 ఓట్లు వచ్చాయి. 1951లో ఏర్పాటైన హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ కంచుకోటగా నిలిచింది. ఆ తర్వాత 1984 నుంచి ఎంఐఎం గెలుస్తూ వస్తోంది. ఈ లోక్‌సభ పరిధిలో మలక్‌పేట్, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకత్పురా, బహదూర్‌పురా అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. అసదుద్దీన్ ఒవైసీ మొదటిసారిగా 2004 ఎన్నికల్లో పోటీ చేసి లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుస విజయాలతో విజయ ఢంకా మోగిస్తూ వస్తున్నారు. దీంతో హైదరాబాద్ స్థానం మజ్లిస్ పార్టీకి కంచుకోటగా మారింది. హైదరాబాద్ స్థానం నుంచి అసదుద్దీన్ ఒవైసీ మరోసారి భారీ విజయం సాధించారు.
ఇదిలావుంటే, తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ 8 స్థానాల్లో, కాంగ్రెస్ 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. AIMIM ఒక సీటు గెలుచుకుంది. ఇక ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ ఒక్క స్థానాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…