తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. 17 ఎంపీ సీట్లతో పాటు ఒక అసెంబ్లీ స్థానానికి మరికొద్ది గంటల్లో పోలింగ్ జరగనుంది. పోలింగ్ స్టేషన్లకు ఈవీఎంల తరలింపు పూర్తయింది. పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకున్నారు. రేపు ఉదయం 5 గంటలకు మాక్ పోలింగ్ ప్రారంభం అవుతుంది. దాన్ని ఆరున్నరకల్లా ముగించి…ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ చేపడతారు
ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్
తెలంగాణలో పోలింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. మరికొద్ది గంటల్లో 17 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నిక జరగనుంది. దీనికోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 6గంటల వరకు క్యూలో ఉన్న వారందరికీ ఓటు వేసే ఛాన్స్ ఉంటుంది. ఇక, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఈవీఎంలు, పోలింగ్ సామాగ్రి పంపిణీ పూర్తయింది. సెక్టార్ల వారీగా ఈవీఎంలను పంపిణీ చేశారు. భద్రత మధ్య పోలింగ్ స్టేషన్లకు ఈవీఎంలను తరలించారు. పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది చేరుకున్నారు.
సికింద్రాబాద్‌లో అత్యధికం.. ఆదిలాబాద్‌లో అత్యల్పం
లోక్‌సభ ఎన్నికల బరిలో 525 మంది అభ్యర్థులు నిలిచారు. వీరిలో 50 మంది మహిళలు ఉన్నారు. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానంలో 45మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక మెదక్ ఎంపీ సీటులో 44మంది అభ్యర్థులు కుస్తీ పడుతున్నారు. ఆదిలాబాద్ లోక్‌సభ బరిలో అత్యల్పంగా 12మంది మాత్రమే బరిలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3కోట్ల 32లక్షల 32వేల మంది ఓటర్లు ఉంటే, వారిలో యువ ఓటర్లు 9 లక్షల 20 వేల మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35వేల 808 పోలింగ్ కేంద్రాలు ఉంటే వాటిలో సమస్యాత్మక కేంద్రాలు 9,900 ఉన్నాయి.
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
పోలింగ్ బందోబస్తు కోసం తెలంగాణలో 164 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. మొత్తం 73,414 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. 106అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మావోయిస్టు ప్రభావిత 13 అసెంబ్లీ స్థానాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. ఇక 61 పోలింగ్ కేంద్రాల్లో 10మంది లోపే ఓటర్లు ఉండడం విశేషం.
ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకోవాలిః సీఈవో
తెలంగాణలో పోలింగ్‌కు సర్వం సిద్ధమైందన్నారు సీఈవో వికాస్‌రాజ్. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్‌తో కలిసి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో DRC సెంటర్‌ను పరిశీలించారు వికాస్ రాజ్.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొని.. ఓటింగ్ శాతాన్ని పెంచాలని సూచించారు. ఓటు ఎలా వేయాలో డెమో ద్వారా వివరించారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్
ఇక ఎంపీ స్థానాలకు పోలింగ్ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్‌లో హై అలర్ట్ ప్రకటించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో మావోయిస్టుల కదలికలపై నిఘా పెంచారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. వరంగల్, మహబూబాబాద్ పరిధిలో బలగాలు కవాతు నిర్వహించాయి. ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉన్నామని తెలంగాణ డీజీపీ రవి గుప్తా తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…