పార్టీలో చేరిన ప్రతీ నేతకు ఝలక్ ఇస్తున్నారు బహుజన సమాజ్‌వాది పార్టీ అధినేత్రి మాయవతి. మొన్న ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్.. నిన్న మంద జగన్నాథం ఇద్దరూ బలై పోయారు. మరీ ముఖ్యంగా జగన్నాథం విషయంలో బీఫామ్.. వేరొకరికి ఇచ్చి షాక్ ఇచ్చారు. దీంతో లోక్‌సభ ఎన్నికల వేళ మాజీ ఎంపీ, బీఎస్పీ నేత మంద జగన్నాథం పరిస్థితి ఎటుకాకుండా పోయింది.
నాగర్ కర్నూల్ నుంచి ఈ సారి ఎంపీగా పోటీ చేయాలన్న ఆయన ఆశ అడిఆశలుగానే మిగిలాయి. జగన్నాథం నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో పోటీ చేయలేని పరిస్థితి తలెత్తింది. పదిరోజుల క్రితమే బీఎస్పీలో చేరిన ఆయన నాగర్ కర్నూల్ నుంచి బహుజన సమాజ్ పార్టీ తరపున ఆయన నామినేషన్ దాఖలు చేశారు. తీరా రెండో సెట్ నామినేషన్ సమయానికి బీఎస్పీ అధ్యక్షురాలు మాయవతి నుంచి బీఫామ్ అందలేదు. దీంతో నామినేషన్లు పరిశీలించిన ఎన్నికల అధికారులు మంద జగన్నాథం నామినేషన్‌ను ఈసీ అధికారులు తిరసస్కరించారు.
అయితే బీఎస్పీ నుంచి బీ ఫామ్ యూసుఫ్ అనే వ్యక్తికి ఇవ్వడంతో జగన్నాథం నామినేషన్ తిరస్కరణకు గురైంది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచే అవకాశం కూడా ఆయనకు లేకుండా పోయింది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో వుండాలంటే కనీసం 10 మంది ఓటర్లు ప్రతిపాదించాలి. కానీ మంద జగన్నాథం నామినేషన్‌లో 5 మంది ఓటర్లు మాత్రమే ప్రతిపాదించారు. దీంతో ఎంపీ అభ్యర్థిగా పోటీలో వుండే అవకాశాన్ని ఆయన కోల్పోయారు.
ఇదిలా ఉంటే నాగర్ కర్నూలుకు చెందిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విషయంలోను ఝలక్ ఇచ్చింది మాయవతి. బీఎస్పీకి తెలంగాణలో భుజానికి ఎత్తుకున్న ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కి అడుగడునా షాక్‌లు ఇచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పొత్తుకు కేసీఆర్ ను సిద్ధం చేశాక వెనక్కి తగ్గారు. దీంతో ఏంచేయాలో తోచని పరిస్థితులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. అదేంటో గాని నాగర్ కర్నూల్‌కి చెందిన అటు మంద జగన్నాథం, ఇటు ప్రవీణ్ కుమార్ విషయంలో బెహన్జీ విచిత్రంగా ప్రవర్తించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…