అవును.. ఆ ప్రాజెక్ట్ ను కాపాడింది వాళ్లే. ఆ యువతే లేకుంటే ఇప్పటికీ ఆ ప్రాజెక్టు వార్త మరోలా ఉండేదేమో. సాక్ష్యాత్తు కడెం ప్రాజెక్ట్ ను కాపాడింది ఆ యువకులే. కడెం ప్రాజెక్ట్ ప్రమాదంలో పడింది.. గేట్లు మొరాయించాయి.. గేట్లు తెరుచుకునే పరిస్థితి లేదన్న సమాచారం తెలియగానే హుటాహుటిన కడెం ప్రాజెక్ట్ వద్దకు చేరుకున్న స్థానిక యువత.. ముగ్గురు సిబ్బంది సాయంతో మ్యానువల్‌గా గంట పాటు శ్రమించి నాలుగు గేట్లను ఎత్తగలిగారు.
అప్పటికే కడెం ప్రాజెక్ట్ ఎగువన రెండు చెరువులు తెగిపోవడం.. కుంటాల పొచ్చెర జలపాతాలకు భారీగా వరద ఉదృతి పెరగడంతో కేవలం 20 నిమిషాల వ్యవదిలో 40 వేల క్యూసెక్కుల నుండి 1.50 లక్షల క్యూసెక్కుల వరద కడెం ప్రాజెక్ట్ కు ముంచెత్తింది. ఈ సమయంలో కడెం ప్రాజెక్ట్ పై విధులు నిర్వహిస్తున్న సిబ్బంది గేట్లను ఎత్తారు. అయితే 18 గేట్లలో ఆరు గేట్లు మొరాయించడంతో మ్యానువల్‌గా ఎత్తే ప్రయత్నం చేశారు. అయితే సిబ్బంది సామర్థ్యం సరిపోకపోవడంతో గేట్లు తెరుచుకోలేదు. గత అనుభవాల నేపథ్యంలో వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది ఉన్నతాదికారులకు సమాచారం అందించి స్థానిక యువత సాయం కోరింది. సమాచారం అందుకున్న 55 మంది స్థానిక యువత హుటాహుటిన కడెం ప్రాజెక్ట్ కు చేరుకుని 6 నుండి 18 వ గేటు వరకు ఐదు గేట్లను గంటన్నర పాటు శ్రమించి అతికష్టం మీద ఎత్తగలిగారు. ఆ సమయంలో 18 గేటు కౌంటర్ వేట్ కు రోప్ వైర్ తెగిపోవడంతో 18 వ గేటును ఎత్తడం సాద్యం కాలేదు. వాజిద్ అనే స్థానిక యువకుడి నేతృత్వంలో 55 మంది యువకులు సిబ్బందికి సహయ సహకారాలు అందించడంతో కడెం వరద ప్రమాదం నుండి బయటపడింది.
ఈ యువతే రాకుంటే కడెం ప్రాజెక్ట్ పరిస్థితి మరోలా ఉండేదని గతంలో లాగే చేతులెత్తేయాల్సిన పరిస్థితి ఎదురయ్యేదని.. సరైన సమయంలో సహయ సహకారాలు అందించిన కడెం యువతకు అభినందనలు తెలిపారు ప్రాజెక్ట్ అదికారులు. ప్రస్తుతం కడెం ప్రమాదం నుండి బయటపడిందని.. నాలుగు గేట్లు తెరుచుకునే పరిస్థితి లేదని.. ప్రాజెక్ట్ ను 685 అడుగులకు పరిమితం చేస్తామని తెలిపారు అదికారులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..