Telangana: ఓవైపు సమైక్యత.. మరోవైపు విమోచన.. మధ్యలో స్వాతంత్య్ర వేడుకలు.. పోటాపోటీ వేడుకల్లో మైలేజ్ ఎవరికి..?
రోజు ఒకటే కాని పేర్లు మూడు.. ఒక్కోక్కరిది ఒక్కో అభిప్రాయం.. చివరికి అందరి లక్ష్యం ఒకటే అదే పొలిటికల్ మైలేజ్.. ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న చర్చ ఇదే, వచ్చే శాసనసభ ఎన్నికల్లో అధికార పీఠాన్ని..
Telangana: రోజు ఒకటే కాని పేర్లు మూడు.. ఒక్కోక్కరిది ఒక్కో అభిప్రాయం.. చివరికి అందరి లక్ష్యం ఒకటే అదే పొలిటికల్ మైలేజ్.. ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న చర్చ ఇదే, వచ్చే శాసనసభ ఎన్నికల్లో అధికార పీఠాన్ని కైవసం చేసుకుని హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా అధికార టిఆర్ ఎస్, తెలంగాణ ఏర్పడిన తర్వాత.. తొలిసారి అధికారాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్, బీజేపీ ఎవరికి వారే తమ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు తమదైన కార్యాచరణతో ఈమూడు ప్రధాన పార్టీలు ముందుకెళ్తున్నాయి. ప్రజలను ఆకట్టుకుని తమ వైపు తిప్పుకునేందుకు ఎవరి ప్లాన్స్ వారివి.. దీనికి వేదికైంది. సెప్టెంబర్ 17.. దేశానికి ఆగష్టు 15వ తేదీన స్వాతంత్య్రం వస్తే రజాకార్ల పాలన నుంచి తెలంగాణకు సెప్టెంబర్ 17న విముక్తి లభించింది. హైదరాబాద్ స్టేట్ భారతదేశంలో కలిసిన రోజు అది. తెలంగాణ సాయుధపోరాటాల గురించి నేటితరం వారికి అంతగా తెలియకపోవచ్చు కాని.. ఆనాటి నిజాం నవాబు నిరంకుశ పాలన గురించి, రజాకర్ల ఆకృత్యాల గురించి, వాటిని ఎదుర్కొవడానికి జరిగిన తెలంగాణ సాయుధ పోరాటాల గురించి వెనుకటితరం వారు నేటికీ ఆనాడు తాము అనుభవించిన కష్టాలు గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆనాడు తమ కళ్ళ ముందు జరిగిన దారుణ మారణకాండ, అత్యాచారాలు, అకృత్యాలు జ్ఞాపకం వస్తే బాధతో కంటి తడి పెట్టుకుంటారు. ఇలా రజాకార్ల పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. చివరికి 1948 సెప్టెంబరు 13వ తేదీన భారత సైన్యం ఆపరేషన్ పోలో పేరిట హైదరాబాద్ (HYDERABAD) సంస్థానాన్ని ముట్టడించింది. దీనికి పోలీస్ యాక్షన్ అనే పేరు పెట్టింది. ఆ తర్వాత సెప్టెంబరు 17న నిజాం నవాబు లొంగుబాటు ప్రకటన చేశారు. ఈ విధంగా హైదరాబాద్ వాసులకు స్వాతంత్య్రం వచ్చింది.
సెప్టెంబర్ 17న రజాకార్ల పాలన నుంచి విముక్తి లభించిన రోజు కాబట్టి ఆరోజును తెలంగాణ (Telangana) విమోచన దినోత్సవంగా నిర్వహించాలని బీజేపీ కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తూ వస్తుంది. తెలంగాణలో తమపార్టీ అధికారంలోకి వస్తే అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహిస్తామని చెప్తూ వస్తోంది. మరోవైపు ఉద్యమ సమయంలో టీఆర్ ఎస్ పార్టీ కూడా సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అందరి ప్రజల మనోభావాల దృష్ట్యా ఈఅంశంపై ఆచీతూచీ వ్యవహరిస్తూ వచ్చింది. కేంద్రంలో బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చినప్పటికి.. సెప్టెంబర్ 17న తెలంగాణ వ్యాప్తంగా పార్టీ కార్యక్రమంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తూ వచ్చారు. అయితే తెలంగాణలో వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పొలిటికల్ మైలేజ్ ను దృష్టిలో పెట్టుకుని.. ఈఏడాది సెప్టెంబర్ 17 నుంచి 2023 సెప్టెంబర్ 17 వరకు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను అధికారికంగా నిర్వహించాలని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసి.. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతారని ప్రకటించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా కౌంటర్ గా వేడుకలు నిర్వహించేందుకు రెడీ అయింది.
తెలంగాణ ప్రాంతం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్యవ్యవస్థలోకి వచ్చి 74 ఏళ్లు పూర్తై.. 75వ వసంతంలోకి అడుగిడుతున్న వేళ తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల పేరిట ఏడాదిపాటు ఘనంగా వేడుకలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా మూడు రోజుల పాటు వజ్రోత్సవ ప్రారంభ వేడుకలను ప్రారంభించి వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. కేంద్రంలోని బీజేపీ (BJP) అధికారికంగా ఈవేడుకలు నిర్వహిస్తే ప్రజల్లో బీజేపీపై సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉందనే ఉద్దేశంతో తాము కూడా ప్రజలందరి మనోభావాలను గౌరవిస్తూ తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహిస్తామని టీఆర్ ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈవేడుకలకు తాము కూడా మద్దతు తెలుపుతున్నామని.. సమైక్యత వజ్రోత్సవాల్లో పాతబస్తీ ప్రజలు పాల్గొనాలని MIM పార్టీ పిలుపునిచ్చింది. మరోవైపు సెప్టెంబర్ 17వ తేదీని రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు TRS, BJP పోటీపడుతుంటే.. మధ్యలో మేమున్నామంటూ కాంగ్రెస్ కూడా ఓ అడుగు ముందుకేసింది. తమ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ స్వాతంత్య్ర వేడుకల పేరుతో కార్యక్రమాల నిర్వహిస్తోంది. ఇలా పొలిటికల్ గా ఏ పార్టీకి ఆపార్టీ తమ మైలేజ్ కోసం సెప్టెంబర్ 17ను వాడుకునే ప్రయత్నం చేస్తోంది.
ఇదే సమయంలో ప్రగతి భవన్ వర్సెస్ రాజ్ భవన్ వార్ కూడా ఈవేడుకలకు వేదికైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమైక్యత వజ్రోత్సవాల పేరిట వేడుకలు నిర్వహించాలని పిలుపునిస్తే తెలంగాణ గవర్నర్ మాత్రం రాజ్ భవన్ లో విమోచన దినోత్సవంగా నిర్వహిస్తామని ప్రకటించారు. దీంతో సీఏం వర్సెస్ గవర్నర్ మధ్య ఇప్పటికే ఉన్న దూరం మరింత పెరిగినట్లైంది. అలాగే తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాల సందర్భంగా సెప్టెంబర్ 17 శనివారం సెలవుదినంగా ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని యాజమాన్యాల విద్యాసంస్థలకు సెలవు ఇస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సెలవు ప్రకటించినా జాతీయ పతాకావిష్కరణ కోసం ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు హాజరవ్వాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన స్పష్టం చేశారు.
తెలంగాణ 75 ఏళ్ల విమోచన దినోత్సవాలు జరుపుకోవడం గర్వకారణమని గవర్నర్ తమిళిసై ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. విమోచనం కోసం పోరాడిన యోధులను స్మరించుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. విమోచన ఉద్యమంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. ఈ సందర్భంగా వారు చేసిన ఉద్యమం చరిత్రాత్మకమన్నారు. ఇలా ఎవరికి వారు సెప్టెంబర్ 17కు పేర్లు మారుస్తూ వేడుకలు నిర్వహించడం దేశ వ్యాప్తంగానూ చర్చనీయాంశమవుతోంది. అయితే ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే రాజకీయ పార్టీలు ఇలా పేర్లు మారుస్తూ వేడుకలు నిర్వహిస్తున్నాయనే విమర్శలు రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఈవేడుకలు రాజకీయంగా ఎవరికి ప్రయోజనం అనేది భవిష్యత్తులో తేలనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..