Leopard Roaming: ఈ మధ్య కాలంలో ఆయా జిల్లాల్లో చిరుత పులులు సంచరిస్తూ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అడవుల్లో ఉండాల్సిన పులులు గ్రామ పరిసరాల్లో, గ్రామాల్లోకి రావడంతో భయాందోళన చెందుతున్నారు. తాజాగా నిర్మల్ జిల్లా కుభీర్ మండలం జాంగాం గ్రామ శివారులో చిరుత పులి సంచరించడం కలకలం రేపుతోంది. పంట పొలాల సమీపంలో అడవి పందిపై చిరు దాడి చేసింది. దీంతో పరిసరాల్లో ఉన్న పశువుల కాపర్లు, వ్యవసాయ కూలీలు భయంతో పరుగులు తీశారు. ఈ విషయం ప్రజలు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఇక ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు పరిశీలించారు. త్వరలోనే దానిని బంధించి తీసుకెళ్తామని, ప్రజలు భయాందోళనకు గురి కావద్దని భరోసా ఇచ్చారు. అయితే పశువులపై, ప్రజలపై దాడి చేస్తుందేమోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత జాడ కోసం అధికారులు గాలిస్తున్నారు.
కాగా, గతంలో నిర్మల్ జిల్లాలోని కుభీర్ మండలం జాంగాం అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరించింది. ఆవు దూడపై దాడి చేసింది. ఇది గమనించిన గ్రామస్థులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే గతంలో కొమురం భీమ్ ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం సహా పలు జిల్లాల్లో పెద్ద పులి సంచారం పెను ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ చిరుత సంచరించడం తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది.