Telangana: నేతల మధ్య కొత్తగా మొదలైన పాత పంచాయితీ.. కాంగ్రెస్ కేడర్‌లో కన్‌ఫ్యూజన్..!

| Edited By: Balaraju Goud

Oct 29, 2024 | 4:03 PM

కాంగ్రెస్ లో వర్గపోరు తారాస్థాయికి చేరిందా..? మిర్యాలగూడపై పట్టు కోసం నేతల పాట్లు పడుతున్నారా..? కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయిందా..? మిర్యాలగూడ పట్టణం పై ఇప్పటివరకూ ఏకఛత్రాధిపత్యం సాగించిన చైర్మన్‌ కు ఎమ్మెల్యే చెక్ పెట్టారా..?

Telangana: నేతల మధ్య కొత్తగా మొదలైన పాత పంచాయితీ.. కాంగ్రెస్ కేడర్‌లో కన్‌ఫ్యూజన్..!
Miryalaguda Congress
Follow us on

రాజకీయ చైతన్యానికి మిర్యాలగూడ మారుపేరుగా ఉంది. అసెంబ్లీ, లోక్‌సభ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి మోగించిన కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. పార్టీ ఫిరాయింపులతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. దీంతో కాంగ్రెస్ లో పాత, కొత్త అనే నినాదంతో నాయకులు ఎవరికి వారే యమునా తీరేగా వ్యవహరిస్తున్నారట. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే బీఎల్ఆర్ నియోజకవర్గంలో పట్టు కోసం తనదైన పొలిటికల్ స్కెచ్ వేస్తున్నారట. తనకు వ్యతిరేకంగా పనిచేసి ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరిన నాయకులను అణచివేసే పనిలో రాజకీయ చక్రం తిప్పుతున్నారట. పార్టీని గాడిలో పెట్టేందుకు ఎమ్మెల్యే బీఎల్ఆర్ డిఫరెంట్ పొలిటికల్ స్ట్రాటజీ తో ముందుకు వెళ్తున్నారట.

మిర్యాలగూడ నియోజక వర్గానికి ఆయువు పట్టుగా ఉన్న మిర్యాలగూడ పట్టణంపై ఆధిపత్యానికి కాంగ్రెస్ లో కోల్డ్ వార్ నడుస్తుందట. మున్సిపల్‌ చైర్మన్‌ తిరునగరు భార్గవ్‌ బీఆర్‌ఎస్‌ నుంచి గెలుపొందగా.. ప్రస్తుత ఎమ్మెల్యే బీఎల్‌ఆర్‌ అప్పుడు కాంగ్రెస్ కౌన్సిలర్‌గా గెలిచి కౌన్సిల్‌ సభ్యుడిగా ఉన్నారు. ఆ సమయంలో ఇద్దరు మధ్య తీవ్ర స్థాయిలో రాజకీయ యుద్ధం కొనసాగింది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో చైర్మన్ భార్గవ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. భార్గవ్ చేరికను ముందు నుంచే వ్యతిరేకించిన ఎమ్మెల్యే బీఎల్ఆర్ అనుచరులతోపాటు మిర్యాలగూడకు చెందిన డీసీసీ అధ్యక్షుడు శంకర్‌ నాయక్‌ కూడా వ్యతిరేకించారు. పార్టీ పెద్దల సూచనల మేరకు ఒకే చెప్పాల్సి వచ్చింది.

ఇక అప్పటి నుంచే మిర్యాలగూడ కాంగ్రెస్ లో కోల్డ్ వార్ మొదలైందట. కౌన్సిలర్‌గా ఉన్న బీఎల్‌ఆర్‌ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో తనకు వ్యతిరేకంగా ఉన్న చైర్మన్‌ను రాజకీయంగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారట. పదేళ్లు మున్సిపాలిటీపై ఏకఛత్రాధిపత్యం సాగించిన ఛైర్మన్‌ను ఇప్పుడు నామమాత్రపు ప్రజాప్రతినిధిగా మారిపోయారట. మున్సిపల్‌ సిబ్బంది, అధికారులతో ప్రత్యేక సమావేశాలు ఎమ్మెల్యే నిర్వహిస్తున్నారట. మున్సిపల్ సిబ్బందితోపాటు అధికారులు వద్ద ఆయన మాట చెల్లుబాటు కాకుండా ఎమ్మెల్యే కట్టడి చేశారట. అంతా తన కనుసన్నల్లోనే నడువాలని ఎమ్మెల్యే హుకుం జారీ చేశారట. మరోవైపు మున్సిపల్‌ ప్రథమ పౌరుడు అయిన చైర్మన్‌ భార్గవ్ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే వర్గీయులు ఆహ్వానించడం లేదట.

ఇటీవల మిర్యాలగూడ పట్టణంలోని వై జంక్షన్‌ వద్ద రూ.150కోట్లతో నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ల బ్రిడ్జి శంకుస్థాపనకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరు కాగా.. ఆ వేదికపై ఉన్న ఫ్లెక్సీలో ఛైర్మన్‌ ఫొటోను ప్రత్యేకంగా ఓ బాక్స్‌లో వేసి అతికించినట్లు ఉందట. ఈ పరిణామాలన్నింటితో ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ మధ్య గ్యాప్ మరింత పెరిగిందట.

ఒకే దెబ్బకు సొంత పార్టీ నేతలు.. వారితో అంటగాగుతున్న ఇతర పార్టీల నేతలను టార్గెట్ చేశారట. తన స్కెచ్ లో భాగంగానే దామరచర్ల లో జరిగిన భూ దందాలు, ఆక్రమణలపై ఎమ్మెల్యే దృష్టి పెట్టారట. అక్రమాలకు పాల్పడ్డారంటూ సొంత పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష పార్టీల నేతలకు కూడా నోటీసులు పంపించారట. నోటీసులతోనే సరిపెట్టకుండా యాక్షన్ కు కూడా అధికారులను సిద్ధం చేస్తున్నారట. బీఆర్ఎస్ హయాంలో బినామీ పేర్లతో భూ అక్రమాలకు పాల్పడిన రెండు పార్టీల నేతలకు అధికారులు నోటీసులు పంపిస్తున్నారట. దీంతో సొంత పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష పార్టీ నేతలకు కూడా భయం పట్టుకుందట.

ఎమ్మెల్యే తన డిఫరెంట్ స్టాటజీతో సొంత పార్టీ నేతలతో పాటు బయటి పార్టీ నేతలను కూడా ఒకే దెబ్బకు సెట్ రైట్ చేయాలని ఎమ్మెల్యే భావిస్తున్నారట. మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టేందుకు ఎమ్మెల్యే డిఫరెంట్ గా నరుకు వస్తున్నారట. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేకు సహకరించని కొందరు కాంగ్రెస్ నేతలు.. ఇప్పటికే అసంతృప్తితోనే ఉన్నారట. కాంగ్రెస్ అగ్రనేతల సహకారంతో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా గ్రూప్ కట్టాలని భావించిన కొందరికి నిరాశ ఎదురైందట. పెద్దల సహకారం లేకపోవడంతో అసమ్మతి నేతలు సైలెంట్ అవుతున్నారట. ఎమ్మెల్యే బిఎల్ఆర్ తనదైన మార్క్ రాజకీయంతో పట్టు సాధించే పనిలో పడ్డారట. ఇప్పటివరకు నియోజకవర్గానికి పెద్ద దిక్కుగా ఉన్న సీనియర్ నేత జానారెడ్డి మిర్యాలగూడ కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలన్నింటిని గమనిస్తున్నారట. కాంగ్రెస్ లో జరుగుతున్న ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయోనని క్యాడర్ ఆందోళన చెందుతుందట.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..