Telangana: ఊపందుకున్న యాసంగి నాట్లు.. వరుసకట్టిన పొరుగు రాష్ట్రాల వలస కూలీలు!

వానాకాలం ముగియడంతో రాష్ట్రంలోని పలుచోట్ల వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే కూలీల కోసం రైతులు పడరానిపాట్లు పడుతున్నారు. ఒకప్పుడు గ్రామాల్లోని మహిళలు సందడిగా నాట్లు, కోతలు వంటి వ్యవసాయ పనుల్లో చురుగ్గా పాల్గొనేవారు. కానీ నేడు ఏ గ్రామంలో చూసినా ఈ దృశ్యం కనిపించడం లేదు..

Telangana: ఊపందుకున్న యాసంగి నాట్లు.. వరుసకట్టిన పొరుగు రాష్ట్రాల వలస కూలీలు!
Bihar Agriculture Labourers
Follow us
N Narayana Rao

| Edited By: Srilakshmi C

Updated on: Jan 08, 2025 | 2:12 PM

ఖమ్మం, జనవరి 8: ఖమ్మం జిల్లాలో వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే నాటు వేసేందుకు కూలీలు మాత్రం దొరకడం లేదు. దీంతో రైతులు ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకొచ్చి నాట్లు వేయిస్తున్నారు. పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల నుంచి వస్తున్న కూలీలు ఏటా వానాకాలం, యాసంగి సీజన్లలో నెల పాటు ఇక్కడే ఉంటారు. ఆయా రాష్ట్రాల్లో పనులు సరిగ్గా దొరకకపోవడం, పని దొరికినా కూలి తక్కువగా ఉండడంతో తెలంగాణలో కూలి ఎక్కువగా ఉండటంతో ఉపాధి నిమిత్తం ఏటా ఇక్కడికి పెద్ద సంఖ్యలో కూలీలు వస్తుంటారు. తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి వనరులు పెరగడమేకాక భారీ వర్షాలతో జలవనరులు కళకళలాడుతున్నాయి. దీంతో చిన్న కమతాలు ఉండి నీటి వనరులులేని వ్యవసాయ కుటుంబాలు ఇప్పుడు సాగు చేసుకుంటున్నాయి.

ఖమ్మం జిల్లాలో సాగర్ ఆయకట్టుకుతోడు ఉమ్మడి జిల్లాలో ఇతర నీటి వనరుల ఆధారంగా సాగు ఏటేటా పెరుగుతోంది. ఫలితంగా స్థానికంగా కూలీల లభ్యత తగ్గడం, యంత్రాలు అందుబాటులోకి వచ్చినా అన్ని పనులు చేయలేని పరిస్థితి ఎదురవుతుండడంతో రైతులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా వరి నాట్లకు వినియోగంలోకి తీసుకొచ్చిన యంత్రాలు మెరుగైన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో రైతులు కూలీలపైనే ఆధారపడుతున్నారు. నేలకొండపల్లి మండలంలో వివిధ గ్రామాల్లో వరి నాట్లు వేసేందుకు పచ్చిమ బెంగాల్‌ నుంచి 40 మంది కూలీలు వచ్చారు. నాటు వేసినందుకు ఎకరానికి రూ.4,500 తీసుకుంటారు. ఇక్కడి రైతులు కుడా వారు చేసే పని మెచ్చుకుంటున్నారు. పచ్చిమ బెంగాల్ కూలీలు నాటు వేస్తే పంట ఎక్కువగా వస్తోందని చెపుతున్నారు.

రోజువారీగా తీసుకునే కూలి తక్కువగా ఉండడమే కాక పని చకచకా పూర్తవుతుండడంతో రైతులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలతో వరి నాట్లు వేయించుకుంటున్నారు. మొత్తం 40 మంది ముఠాగా ఏర్పడి రోజుకు ఐదెకరాల్లో నాట్లు వేస్తున్నారు. ఎకరాకు రూ.4,500 చొప్పున తీసుకోవడంతో పాటు నారు కట్టలను కూడా వీరే మోస్తుండడంతో పని సులువవుతోంది. పశ్చిమబెంగాల్, బీహార్, ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల నుంచి ఏటా వానాకాలం, యాసంగి సీజన్లలో కూలీలు ఇక్కడకు వచ్చి నెల పాటు రైతుల క్షేత్రాల వద్దే బస చేస్తున్నారు. వరి నాట్లే కాకుండా మిర్చి ఏరడం, ఇతర వ్యవసాయ పనులు కూడా చేస్తుండడంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వీరికి మంచి ఆదరణ లభిస్తోంది. ఇక్కడ నాట్లు పూర్తయ్యాక ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి తదితర జిల్లాలకు వెళ్తామని వలస కూలీలు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.