Telangana: బీఆర్ఎస్‎లోకి వచ్చేందుకు సిద్దంగా కొందరు నేతలు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..

|

Aug 15, 2024 | 9:26 PM

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్టేషన్‎ఘనపూర్ జెట్పీటీసీ మార్పాక రవి, మాజీ ఎంపిపి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‎లోకి చేరారు. వారిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Telangana: బీఆర్ఎస్‎లోకి వచ్చేందుకు సిద్దంగా కొందరు నేతలు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..
KTR
Follow us on

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్టేషన్‎ఘనపూర్ జెట్పీటీసీ మార్పాక రవి, మాజీ ఎంపిపి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‎లోకి చేరారు. వారిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. స్టేషన్‎ఘనపూర్ బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు. తాటికొండ రాజయ్యతో పార్టీ బలోపేతంపై చర్చించారు. ఈ సందర్భంగానే ఇటీవల ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి కాంగ్రెస్ లో చేరిన మాజీ జెడ్పీటీసీ మార్పాక రవి తిరిగి కారు పార్టీలో చేరిపోయారు. ఈ సందర్భంగా తాటికొండ రాజయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయని తెలిపారు. అవన్నీ సరిదిద్దుకోవడానికి కృషి చేయాలని కేసిఆర్, కేటీఆర్ తనతో చెప్పారని వివరించారు.

తమ పార్టీ నుంచి వెళ్లిన నేతలందరూ మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సిద్దంగా ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో శ్రీహరికి బీఆర్ఎస్ పార్టీ అనేక పదవులు ఇచ్చిందని గుర్తు చేశారు. అయినప్పటికీ ఆయన పార్టీని మోసం చేసి వెళ్లిపోయారని విమర్శించారు. ఈ సందర్భంగానే కాంగ్రెస్ చేసిన వైఫల్యాలు ప్రజలకు ఎత్తి చూపాలని కార్యకర్తలకు దిశానిర్థేశం చేశారు. తమ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కనీసం నియోజకవర్గంలో పర్యటించి, అవసరమైన అభివృద్ది కూడా చేయటం లేదని ఆరోపించారు.

ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. కాంగ్రెస్ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని అన్నారు.. కానీ చేయలేదన్నారు. రుణమాఫీ కాలేదు, రాహుల్ గాంధీ సభకు రాలేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో రైతులు పండించిన పంటకు బోనస్ ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చాక సన్నవడ్లకే అని సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ మాట మార్చారని విమర్శించారు. అలాగే ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తామని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి బంగారం షాపు వాళ్లు తెలుసో లేదో అని వ్యంగాస్త్రాలు సంధించారు. మహిళలకు ఉచిత బస్సు గురించి కూడా స్పందించారు. బస్సుల్లో అల్లం, వెల్లుల్లి ఓల్చితే తప్పా అని మంత్రి సీతక్క అంటున్నారు. తాము తప్పని, అలా చేయవద్దు అనలేదు. మీ ఇష్టం వచ్చిన పని చేసుకొండి అని వివరించారు.

కేసిఆర్ సీఎంగా ఉన్నప్పుడు బస్సుల్లో ఏనాడైనా ఆడబిడ్డలు కొట్టుకున్నారా? అని ప్రశ్నించారు. కేసిఆర్‎ది కుటుంబ పాలన అంటున్నారు. మరి ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి, ఆయన తమ్ముడు కనిపించడం లేదా అని నిలదీశారు. అది కుటుంబం కాదా అని ప్రశ్నించారు. ఎక్కడ చూసినా సీఎం రేవంత్ రెడ్డితోపాటూ అతని తమ్ముళ్ళ ఫోటోలు కనిపిస్తున్నాయని తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్టేషన్ ఘనపూర్‎కు త్వరలో ఉప ఎన్నిక ఖాయం అని.. తాటికొండ రాజయ్య గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు. మూడు ఉప ఎన్నికలు ఒకే సారి వచ్చేలా ఉన్నాయన్నారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు పార్టీ ఫిరాయింపు కేసు హై కోర్టులో నడుస్తోందని తెలిపారు. ఇప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన మంచి నాయకులు మళ్ళీ తిరిగి వస్తున్నారని పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..