KTR: అలాంటి ప్రచారాలు వద్దు.. కార్యకర్తలకు కేటీఆర్ సూచన

సోష‌ల్ మీడియా వేదిక‌గా అన‌వ‌స‌ర‌మైన ఫేక్ ప్ర‌చారాలు చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌ని సూచించారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ ప‌రంగా గెలుపొందిన వారిని తాము సంప్ర‌దించ లేద‌న్నారు. వారిని కొనుగోలు చేసే శ‌క్తి త‌మ‌కు లేద‌ని చెప్పారు. త‌న‌తో పాటు త‌న తండ్రి మాజీ సీఎం కేసీఆర్ ప్ర‌జా తీర్పును గౌర‌విస్తామ‌ని పేర్కొన్నారు కేటీఆర్

KTR: అలాంటి ప్రచారాలు వద్దు.. కార్యకర్తలకు కేటీఆర్ సూచన
BRS Working President KTR

Updated on: Dec 06, 2023 | 11:55 AM

‘‘కాంగ్రెస్​ ఎమ్మెల్యేలను లాక్కొని బీఆర్ఎస్​ సర్కార్ ఏర్పాటవుతుంది. కాంగ్రెస్​ ప్రభుత్వం కూలిపోతుంది. కాంగ్రెస్‌ను పడగొట్టబోతున్నాం..” అంటూ సోషల్​మీడియాలో తప్పుడు​ ప్రచారాలు చేయొద్దని పార్టీ శ్రేణులకు BRS వర్కింగ్​ప్రెసిడెంట్ ​కేటీఆర్​ సూచించారు. మంగళవారం ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట పెట్టారు. ఎన్నికల్లో  BRS ఓటమి తర్వాత ప్రజల నుంచి సానుభూతి వస్తోందని, కేసీఆర్​మళ్లీ ముఖ్యమంత్రి అయితే బాగుండు అనే భావన వారిలో చాలా మందిలో ఉందని ఆయన పేర్కొన్నారు. కానీ, ప్రజల తీర్పును గౌరవిస్తామని, కొత్త సర్కార్ ఏర్పాటుకు సహకరిస్తామని హుందాగా ప్రకటించామని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తప్పుడు​ప్రచారం చేయడం మంచిది కాదని, ఇలాంటి ప్రచారాన్ని ప్రజలు కూడా హర్షించరేని కేటీఆర్ పేర్కొన్నారు.

ప్రజల ఆమోదంతో రెండు పర్యాయాలు కేసీఆర్ ​ప్రభుత్వం ఏర్పాటు చేశారని, భవిష్యత్​లోనూ ప్రజల ఆమోదంతోనే BRS ​ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు ఎంత హుందాగా ఉన్నామో, ప్రతిపక్షంలో అంతకన్నా రెట్టింపు హుందాతనంతో ప్రజల పక్షాన కొట్లాడుదామని కేటీఆర్​ పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇక పార్టీ ఓటమి అనంతరం తనపై ప్రజలు చూపిస్తున్న ప్రేమకు, చూపెడుతున్న మద్దతుకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…