Telangana: ఉద్యోగుల శాలరీలపై తెలంగాణలో పొలిటికల్ వార్

|

Oct 09, 2024 | 11:31 AM

తెలంగాణలో పండగ చుట్టూ పాలిటిక్స్ మొదలయ్యాయి. పండగ వస్తున్నా.. ఇప్పటికీ అనేక మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు లేవని ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది బీఆర్ఎస్. అయితే గులాబీ లీడర్ల కామెంట్స్‌కు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది కాంగ్రెస్.

Telangana: ఉద్యోగుల శాలరీలపై తెలంగాణలో పొలిటికల్ వార్
KTR - CM Revanth Reddy
Follow us on

తెలంగాణలోని అధికార కాంగ్రెస్‌ను అనేక అంశాల్లో టార్గెట్ చేస్తున్న బీఆర్ఎస్… పలు విభాగాల్లోని ఉద్యోగులకు ఇప్పటికీ జీతాలు అందలేదని సర్కార్‌పై విమర్శలు గుప్పించింది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ప‌ట్ల రేవంత్ సర్కార్ నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఒక‌టో తేదీన జీతాలు ఇస్తున్నామ‌ని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ స‌ర్కార్‌కు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది క‌నిపించ‌డం లేదా..? అని ప్రశ్నించారు. దండ‌గ‌మారి పాల‌న‌లో పండుగ పూట కూడా ప‌స్తులు ఉండాల్సిన ప‌రిస్థితి ఏర్పడిందన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఐదారు నెలలుగా జీతాలు లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 10 నెలల్లో తెచ్చిన రూ. 80 వేల కోట్లు అప్పులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు.

8వ తేదీ దాటినా జీతాలు ఇవ్వకపోవడం దుర్మార్గం- హరీష్‌రావు

ఒకటో తేదీన రావాల్సిన జీతాలు.. 8వ తేదీ దాటినా ఇవ్వకపోవడం దుర్మార్గమని మాజీమంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులందరికీ ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి.. సీఎం సీటులో కూర్చున్న తర్వాత ఆ మాటలన్నీ మరిచిపోయారని విమర్శించారు. తెలంగాణలో ఆడపడుచులు ఎంతో ఘనంగా జరుపుకునే బతుకమ్మ, దసరా పండుగ పూట ఆశవర్కర్లకు వేతనాలు చెల్లించకుండా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వం రాజకీయ భాష అదుపు తప్పిందని.. హైదరాబాద్ కళ తప్పిందని.. బ్రతుకు బండి పట్టాలు తప్పిందని ఆరోపించారు.

బీఆర్ఎస్ నేతలవి అనవసర విమర్శలు- బీర్ల ఐలయ్య

అయితే తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. సీఎం రేవంత్ ఢిల్లీ టూర్ సహా ప్రతి అంశాన్ని బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ కంటే తమ పాలన గొప్పగా ఉందన్నారు.

ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని ఉద్యోగులకు కూడా జీతాలు ఆలస్యంగా వస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా మరికొందరు ఉద్యోగుల పరిస్థితి కూడా ఇలాగే ఉందని బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.