KRMB-AP-TS: కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకునే అంశంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేఆర్ఎంబీ చైర్మన్ లేఖ రాశారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను తక్షణమే అప్పగించాలని ఆ లేఖలో కేఆర్ఎంబీ చైర్మన్ కోరారు. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్ తో పాటు వాటి నుంచి నేరుగా నీటిని వాడుకునే 15 ప్రాజెక్టులను తక్షణమే అప్పగించాలని కృష్ణా బోర్డు చైర్మన్ మహేంద్ర ప్రతాప్ సింగ్ ఆదేశించారు. కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ జూలై 15న గెజిట్ నోటిఫికేసన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ గెజిట్‌ను అక్టోబర్ 14వ తేదీ నుంచే అమలు చేయాల్సి ఉండే. కానీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో.. తాత్సారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కేఆర్ఎంబీ చైర్మన్ మహేంద్ర ప్రతాప్ సింగ్ ఇరు రాష్ట్రాల సీఎస్‌లకు లేఖలు రాశారు.
ఇకపోతే.. శ్రీశైలం స్పిల్ వే, కుడి గట్టు విద్యుత్ కేంద్రం, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీ-నీవా (మల్యాల, ముచ్చుమర్రి పంప్ హౌస్), సాగర్ కుడి కాలువ విద్యుత్ కేంద్రాలను బోర్డుకు అప్పగిస్తూ గత నెల 14వ తేదీనే ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం, కల్వకుర్తి ఎత్తిపోతల, సాగర్ స్పిల్ వే, ప్రధాన విద్యుత్ కేంద్రం, ఎఎమ్మార్పీ, సాగర్ వరద కాలువ, సాగర్ ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్, విద్యుత్ కేంద్రం, సాగర్ కుడి కాలువలను తెలంగాణ సర్కార్ నుంచి స్వాధీనం చేసుకున్నప్పుడే తమ ప్రాజెక్టులను అధీనంలోకి తీసుకోవాలని షరతు విధించింది. దీంతో కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు సందిగ్ధంలో పడింది. ఇక ఇప్పటి దాకా 9 అవుట్ లెట్లను బోర్డుకు స్వాధీనం చేయడంపై తెలంగాణ సర్కార్ ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. ఈ నేపథ్యంలోనే.. స్పందించిన కేఆర్ఎంబీ.. నోటిఫికేషన్ అమలుకు వీలుగా తక్షణమే శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తూ రెండు రాష్ట్రాలు ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది. వాటి కార్యాలయాలు, సిబ్బందిని, వాహనాలను కూడా బోర్డుకు అప్పగించాలని లేఖలో పేర్కొన్నా కేఆర్ఎంబీ చైర్మన్.
ఇదిలాఉంటే.. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఘాటుగా స్పందించారు. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఒక డ్రామాగా అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వానికి దమ్ముంటే తెలంగాణకు జల కేటాయింపుల అంశాన్ని తక్షణమే ట్రిబ్యునల్‌కు రిఫర్ చేయాలన్నారు. సెక్షన్ సి కింద కేంద్రం ఎందుకు రిఫర్ చేయట్లేదని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలో ఉన్నది అసమర్థ ప్రభుత్వం అని నిప్పులు చెరిగారు సీఎం కేసీఆర్. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి నీళ్లు రావొద్దా? అని ప్రశ్నించారు.
Also read:
Entertainment: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో అలరించనున్న సినిమాలివే..
Crime News: ఆ బాలికది హత్యే.. దారుణంగా కొట్టి చంపారు.. రంగంలోకి పోలీసు, టాస్క్‌ఫోర్స్ బృందాలు..