వరంగల్ జిల్లాలో పిల్లల కిడ్నాప్ ముఠాలు కలకలం రేపుతున్నాయి. అందులో నిజం ఎంతో.. అబద్ధం ఎంతో.. కానీ కొత్తవ్యక్తులు కనబడితే చాలు పిల్లలు కేకలు పెడుతూ తీవ్ర భయాందళన చెందుతున్నారు. భయంతో పరుగులు పెడుతున్నారు. కిడ్నాప్ ముఠాలు సంచరిస్తున్నారు జాగ్రత్త అంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుంది. ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే చాలు పిల్లలు భయంతో గజగజ వానికి పోతున్నారు. తాజాగా వరంగల్ జిల్లాలో రెండు ఘటనలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. రాయపర్తి మండలం బురహాన్ పల్లి ప్రభుత్వ పాఠశాల వద్ద కిడ్నాప్ ముఠా కలకలం రేపింది. బురకా ధరించి స్కూల్ ముందు మాటువేశారనే సమాచారంతో విద్యార్థులు హడలెత్తిపోయారు. ఇద్దరు మహిళలు మరో ఇద్దరు వ్యక్తులు ఆటోలో వచ్చి పాఠశాల ముందు పిల్లల్ని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నం చేశారని స్కూల్ విద్యార్థులు హడలెత్తిపోయారు. ఆటోలో అనుమానస్పదంగా కనిపించిన వారిని చూసి పెద్ద ఎత్తున కేకలు పెట్టారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలో దిగిన పోలీసులు విచారణ జరుపుకున్నారు.
అక్కడ విచారణ జరుగుతున్న క్రమంలోనే వరంగల్లోని అండర్ రైల్వే గేట్ ప్రాంతంలో మరో ఘటన జరిగింది. ఇబ్రహీం అనే బాలుడు స్కూల్ నుండి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి తన చేయి గుంజి బైక్పై ఎక్కించుకునేందుకు ప్రయత్నం చేశారు. బాలుడు భయంతో కేకలు పెడుతూ స్కూల్లోకి పరిగెత్తాడు. స్కూలు ఉపాధ్యాయులు వెంటనే బయటికి వచ్చి ఆ వ్యక్తుల కోసం ఆరా తీశారు. అక్కడ ఎవరూ కనిపించలేదు. అయితే తనను బైక్పై ఎక్కించుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తి బుర్కా ధరించి ఉన్నాడని విద్యార్థి తెలిపాడు. ఉపాధ్యాయులు వెంటనే ఈ వ్యవహారాన్ని పోలీసులకు తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.
అయితే పిల్లలు ఆరోపిస్తున్నట్లు నిజంగానే అవి కిడ్నాప్ ముఠాలా..? లేక గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం చూసి పిల్లలు ఆందోళన చెందుతున్నారా..? అనే ప్రశ్న తలెత్తుతుంది. పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా అదే ఆందోళన చెందుతున్నారు. కొత్త వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే చాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కొత్త వ్యక్తులు ఎవరైనా సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..