BRS Meeting: ధూంధాంగా ఖమ్మం బీఆర్ఎస్ సభ.. మినిట్ టు మినిట్ సీఎం షెడ్యూల్..

| Edited By: Ravi Kiran

Jan 18, 2023 | 11:17 AM

Khammam BRS Meeting: నలుగురు సీఎంలు, ఇద్దరు మాజీ సీఎంలు, జాతీయ స్థాయి నేతలు, వెయ్యిమంది వీవీఐపీలు.. వామపక్షాలతో పాటు పలు సంఘాల నేతలు.. వీళ్లందరూ ఒక్కచోట చేరితే అదే ఖమ్మం సభ.

BRS Meeting: ధూంధాంగా ఖమ్మం బీఆర్ఎస్ సభ.. మినిట్ టు మినిట్ సీఎం షెడ్యూల్..
BRS Party Office Inauguration
Follow us on

నలుగురు సీఎంలు, ఇద్దరు మాజీ సీఎంలు, జాతీయ స్థాయి నేతలు, వెయ్యిమంది వీవీఐపీలు.. వామపక్షాలతో పాటు పలు సంఘాల నేతలు.. వీళ్లందరూ ఒక్కచోట చేరితే అదే ఖమ్మం సభ. చరిత్రలో నిలిచిపోయేలా భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది బీఆర్‌ఎస్. ఖమ్మం గుమ్మం నుంచి బీఆర్ఎస్ సమర శంఖం పూరించి.. తమ సత్తా ఏంటో చూపించబోతున్నారు సీఎం కేసీఆర్. సభకు ముగ్గురు సీఎంలు, నేషనల్ పార్టీ లీడర్లను ఆహ్వానించడం ద్వారా జాతీయ స్థాయిలోనూ చర్చ జరిగేలా ప్లాన్ చేసింది బీఆర్‌ఎస్. ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయ్ తో పాటు.. మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజాతో పాటు మొత్తం 200 మంది నేతలు సభా వేదికపై కూర్చోనున్నారు. అయితే కేసీఆర్ సహా ముఖ్య నేతలు ఎన్ని గంటలకు వస్తారు.. వారి షెడ్యూల్ ఏంటో చూద్దాం.

కాసేపట్లో ముగ్గురు సీఎంలతో భేటీ కాబోతున్నారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్‌లో బ్రేక్ ఫాస్ట్ చేయనున్నారు. ఆ తర్వాత బేగంపేట నుంచి 2 హెలికాప్టర్లలో యాదాద్రికి బయలుదేరి వెళ్లనున్నారు. కేరళ సీఎం పినయి విజయన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్‌, అఖిలేష్ యాదవ్‌తో పాటు పలువురు కీలక నేతలతో కలిసి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటారు సీఎం కేసీఆర్. అక్కడ ప్రత్యేక పూజలు చేయనున్నారు. నలుగురు సీఎంలు వస్తున్న నేపథ్యంలో ఉదయం 9 నుంచి మద్యాహ్నం ఒంటి గంట వరకు దర్శనాలు నిలిపివేశారు. అర్జిత సేవలకు కూడా బ్రేక్ పడింది. యాదాద్రి దర్శనం అనంతరం నేరుగా ఖమ్మం వెళ్లనున్నారు నలుగురు సీఎంలు.

సంక్షిప్తంగా షెడ్యూల్ వివరాలు..

– 11.30కి యాదాద్రి నుంచి ఖమ్మం వస్తారు.

ఇవి కూడా చదవండి

– 12 గంటలకి ఖమ్మం కలెక్టర్ ఆఫీసు ప్రారంభోత్సవం.

– 12.20కి రెండవ విడత కంటి వెలుగు ప్రారంభం.

– 1 గంటకి కలెక్టరేట్‌లో లంచ్ చేస్తారు.

– 2.30కి సభా వేదికపైకి నలుగురు సీఎంలు చేరుకుంటారు.

భారీ జనసమీకరణ..

ఖమ్మం సభకు భారీ ఏర్పాట్లు చేసింది బీఆర్ఎస్. ఐదు లక్షల మంది జనసమీకరణతో ఈ సభ నిర్వహిస్తున్నారు. 448 ఎకరాల్లో పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. మొత్తం వెయ్యిమంది వాలంటీర్లను నిమించారు.

సభావేదిక వివరాలు..

– 70 ఎకరాల స్థలంలో బహిరంగ సభ.

– 140 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పుతో వేదిక.

– వేదికపై 200 మంది కూర్చునేలా ఏర్పాట్లు.

– 5 లక్షల మందిని తరలించేలా సన్నాహాలు.

– 5,200 మంది పోలీసులతో భారీ బందోబస్తు.

– సభా ప్రాంగణంలో 50 LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు.

– 448 ఎకరాల్లో 23 చోట్ల పార్కింగ్.

నలుగురు సీఎంలతో పాటు సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు, సీపీఐ సీనియర్‌ నేత పువ్వాడ నాగేశ్వరరావు సహా పలువురు వామపక్ష జాతీయ నాయకులు వేదికపై కూర్చుంటారు. ఇతర పార్టీలు, సంఘాల నేతలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా మొత్తం 200 మందికి పైగా నాయకులు వేదికపై ఆశీనులు కాబోతున్నారు. కీలక నేతలు ఖమ్మంకు వస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు అధికారులు. ఖమ్మం పరిసరాలన్నీ పూర్తిగా అధికారుల ఆధీనంలోకి వెళ్లాయి.

భద్రతా వలయం..

– ఇద్దరు డీఐజీలు, ఆరుగురు ఐపీఎస్‌లు.

– 10 మంది అదనపు ఎస్పీలు.

– 3-9 మంది ఏసీపీలు, 139 మంది సీఐలు.

– 409 మంది ఎస్సైలు.

– 530 మంది ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు.

– 1772 మంది కానిస్టేబుళ్లు.

– 169 మంది మహిళా కానిస్టేబుళ్లు.

– 1005 మంది హోంగార్డులు.

– 120 మంది స్పెషల్‌ పార్టీ టీమ్.

పార్కింగ్ కోసం క్యూఆర్ కోడ్..

పెద్ద ఎత్తున తరలివచ్చే నేతలు, కార్యకర్తల కోసం జిల్లాల వారీగా పార్కింగ్‌ స్థలాలను కేటాయించారు. వాహనాలకు క్యూఆర్‌ కోడ్‌ను ఇస్తారు. దానిని స్కాన్‌ చేస్తే వారు వెళ్లాల్సిన పార్కింగ్‌ ప్రదేశాన్ని గూగుల్‌ మ్యాప్‌లో సూచిస్తుంది. క్యూ ఆర్ కోడ్ ఉన్న వాహనాలను మాత్రమే అనుమతిస్తారు అధికారులు.

దారి మళ్లింపు..

ఖమ్మం మీదుగా వెళ్లే అన్ని వాహనాలను దారి మళ్లించారు. సూర్యాపేట నుంచి సత్తుపల్లి, రాజమండ్రి, విశాఖపట్నం వైపు వెళ్లే వాహనాలను కోదాడ హైవే మీదుగా విజయవాడ వైపు మళ్లించారు. ఇక వరంగల్‌ వైపు వెళ్లే వాహనాలను డోర్నకల్‌ వైపు మళ్లించారు. ఖమ్మం వైపు వచ్చే అన్ని రూట్లలో వాహనాల డైవర్షన్ చేశారు అధికారులు.

మరోసారి ఖమ్మం వేదికగా..

ఉద్యమాల పురిటిగడ్డ అనిపించుకున్న ఖమ్మం గుమ్మం.. మరోసారి కేసీఆర్ ఆశయాలకు వేదిక అయింది. దేశం మొత్తం తమవైపే చూసేలా.. అన్ని రాజకీయ పార్టీలు చర్చించుకునే అతి భారీ బహిరంగ జరుగుతోంది ఖమ్మం గుమ్మంలో. బీఆర్‌ఎస్ ఆవిర్భావం తర్వాత తొలి బహిరంగ సభకు వేదిక అయిందీ ఖమ్మం. ఈ వేదిక నుంచి సీఎం కేసీఆర్ ఏం ప్రకటించబోతున్నారు, ఎలా ముందుకెళ్లబోతున్నారు, జాతీయ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ ప్రస్థానం ఎలా ఉండబోతుందనేది ఆసక్తికర అంశం.

గుమగుమలాడే వంటకాలు..

ఖమ్మంలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ సభకు విచ్చేసే అతిథిలకు నోరూరించే వంటకాలు సిద్ధం చేశారు. నలుగురు సీఎం లకు తెలంగాణ రుచులు తినిపించనున్నారు. ప్రత్యేక చెఫ్‌లతో 64 వెచ్, నాన్ వెజ్ వంటకాలు రెడీ చేశారు. కలెక్టరేట్ ప్రారంభం తర్వాత మధ్యాహ్నం 1.30 కు కలెక్టరేట్‌లోనే లంచ్ చేయనున్నారు నేతలు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..