Telangana: ఎర్రవల్లి భూములపై సర్కార్ నజర్.. రికార్డుల వేటలో అధికారులు.. రైతుల ఆందోళన..
తెలంగాణ పాలిటిక్స్‌లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూముల వ్యవహరం పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఎర్రవల్లి భూముల సర్వే కొనసాగుతోంది. గురువారం సుమారు 2 గంటల పాటు ఎర్రవల్లి, శివారు వెంకటాపూర్, వరదరాజ్ పూర్ గ్రామాల సరిహద్దులోని 325 సర్వే నెంబర్ లో భూముల సర్వే చేసిన అధికారులు.. శుక్రవారం కూడా ఎర్రవల్లి భూముల సర్వే కొనసాగే అవకాశాలు ఉన్నాయి.

Kcr Erravalli Farmhouse Land Dispute
ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో 388 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని ఈ భూములపై నెల రోజుల్లో లెక్కలు తేల్చాని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇవ్వడంతో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. మర్కుక్ తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లిన రెవెన్యూ అధికారులు.. భూరికార్డులకు సంబంధించిన ఫైల్స్ వెలికితీశారు. ఎర్రవల్లి, వెంకటపూర్ సర్వే నంబర్లను పరిశీలించారు. సర్వే నంబర్ 325లో సుమారు 385 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించిన వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రభుత్వ భూమి ఎంత..? పట్టా భూమి ఎంత..? ఎవరి పేరుపై ఉంది..? అనే వివరాలు ఆరా తీశారు. మరోవైపు పాత రికార్డులు చెబుతున్న లెక్కలకు.. ప్రస్తుతం భూమిపై కనిపిస్తున్న పరిస్థితికి ఏమైనా తేడా ఉందా అన్నది తెలుసుకునేందుకు టెక్నాలజీ ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. గూగుల్ ఎర్త్‌లోని పాత శాటిలైట్ చిత్రాలను పరిశీలిస్తూ వాస్తవాలేంటో బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అంటే.. భూమి గతంలో ఎలా ఉంది..? ఇప్పుడు ఎలా ఉంది..? మధ్యలో ఏమైనా మార్పులు జరిగాయా..? అన్నది కూడా రికార్డులతో పాటు టెక్నాలజీ సాయంతో పరిశీలిస్తున్నారు.
మరోవైపు అధికారుల క్షేత్రస్థాయి సర్వేపై స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ భూములు తమ సాగులోనే ఉన్నాయని రైతులు చెబుతున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా తమ భూముల్లో సర్వేలు చేయడం ఏంటని ప్రశ్నించారు రైతులు. ఈ భూములన్నీ ఎస్సీలమైన తామే సాగుచేసుకుంటున్నామన్నారు. మరి రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా ఉన్నట్లు చెబుతున్న సుమారు 385 ఎకరాలు.. ప్రస్తుతం ఎక్కడ ఉంది? రైతుల సాగులో ఉందా? ఇతరుల అధీనంలో ఉందా? ఈ లెక్కలు తేలకముందే.. భూముల వ్యవహారం పొలిటికల్ హీట్ పెంచుతోంది.
మరోవైపు సిద్దిపేట జిల్లాలో పర్యటించేందుకు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ సీఎల్పీ పాయింట్ నుంచి బస్సులో నేతలంతా అక్కడికి వెళ్తున్నారు. అక్కడ రెవెన్యూ ఆఫీస్‌లో భూరికార్డులను పరిశీలిస్తారు. సిద్ధిపేట కలెక్టరేట్.. అక్కడి నుంచి రెవెన్యూ కార్యాలయం.. ఆ తర్వాత హరీశ్‌రావుకు సంబంధించిన భూముల వరకు బస్సుయాత్ర చేయనున్నారు. మరోవైపు బీఆర్ఎస్ టార్గెట్‌గా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. కబ్జా చేసిన భములను వెనక్కి లాగి పేదలకు పార్టీలకు అతీతంగా పంచుతామన్నారు.
మొత్తంగా ఎర్రవల్లి భూములపై ఆరోపణలు, ప్రత్యారోపణలు రాజకీయ వేదికపై కొనసాగుతుంటే.. అధికారులు మాత్రం రికార్డులు, సర్వేలు, క్షేత్రస్థాయి పరిస్థితిపై దృష్టి పెట్టారు. ఆ లెక్క తేలితే.. ఇంతకాలంగా సాగుతున్న భూముల రాజకీయంలో ఏది ఆరోపణ.. ఏది రికార్డు అన్నదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Follow Us
