Telangana Elections: తెలంగాణకు డీకే శివకుమార్.. నెల రోజులు ఇక్కడే బస..!

DKS in Telangana: కాంగ్రెస్ పార్టీ నేత, కర్నాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలంగాణకు వచ్చేస్తున్నారా? ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 30, 40 రోజులు ఇక్కడే మకాం వేయనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది పొలిటికల్ సర్కిల్‌లో. తెలంగాణలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది. కర్నాటకలో గెలుపుతో మాంచి జోష్‌లో ఉన్న కాంగ్రెస్.. అక్కడ విజయానికి కారణమైన డీకే శివకుమార్‌ను..

Telangana Elections: తెలంగాణకు డీకే శివకుమార్.. నెల రోజులు ఇక్కడే బస..!
Dk Shivakumar

Updated on: Oct 07, 2023 | 1:36 PM

DKS in Telangana: కాంగ్రెస్ పార్టీ నేత, కర్నాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలంగాణకు వచ్చేస్తున్నారా? ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 30, 40 రోజులు ఇక్కడే మకాం వేయనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది పొలిటికల్ సర్కిల్‌లో. తెలంగాణలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది. కర్నాటకలో గెలుపుతో మాంచి జోష్‌లో ఉన్న కాంగ్రెస్.. అక్కడ విజయానికి కారణమైన డీకే శివకుమార్‌ను తెలంగాణలోనూ దింపే ప్రయత్నం చేస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించేందుకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ దాదాపు నెల రోజులపాటు హైదరాబాద్‌లో ఎన్నికల నిర్వహణ, వ్యూహాత్మక ప్రణాళికలను పర్యవేక్షించే అవకాశం ఉంది. పార్టీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను శివకుమార్‌ తన ఆధీనంలోకి తీసుకుంటారని, రాబోయే ఎన్నికల్లో విజయానికి రంగం సిద్ధం చేస్తారని కాంగ్రెస్‌లోని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

విశ్వసనీయ సమాచారం ప్రకారం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇటీవల బెంగళూరులో శివకుమార్‌ను కలిశారు. ఆయన్ను తెలంగాణకు ఆహ్వానించారు. తెలంగాణలో పార్టీ ప్రచారానికి రావాల్సిందిగా కోరారు. దీనిపై అంగీకరించిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకేఎస్.. హైదరాబాద్‌లో ఎక్కువ కాలం ఉండేందుకు వీలుగా బస ఏర్పాటు చేయాలని రేవంత్‌ను కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, డీకే రాక.. తెలంగాణ పాలిటిక్స్‌లో కాకపుట్టి్స్తుంది.

బూత్ లెవల్ కమిటీల నిర్వహణ, తెలంగాణలో కర్నాటక ఎన్నికల వ్యూహం అమలుపై చర్చించేందుకు కాంగ్రెస్ కీలక నేతలతో సమావేశమైన డీకేఎస్.. ఎన్నికల నోటిఫికేషన్‌ అనంతరం వెనుదిరిగాలని భావిస్తున్నారట. మరోవైపు శివ కుమార్ నెల రోజుల పాటు బస చేసేందుకు అనువైన నివాసం కోసం టీపీసీసీ ఆరా తీస్తోంది. హైదరాబాద్‌లో పర్యటిస్తున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, నలుగురు ఏఐసీసీ కార్యదర్శులు ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో బస చేసేందుకు మొగ్గుచూపడంతో.. శివ కుమార్‌‌కు మరోచోట బస ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్‌లో టాక్.

ఇవి కూడా చదవండి

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ నియామకంలో శివకుమార్ కీలక పాత్ర పోషించారని ఒక టాక్ ఉంది. ఇక కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేసే విషయమై వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలతోనూ ఆయన మంతనాలు జరిపారు. విలీనం ఇంకా అధికారికంగా జరగనప్పటికీ, చర్చల వెనుక శివకుమార్ కీలకంగా ఉన్నారనేది వాస్తవం. తెలంగాణలో ఇతర పార్టీలకు చెందిన నేతలు ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటే.. ముందుగా డీకేని ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇటీవలి పరిణామాలను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వంటి కాంగ్రెస్‌లో చేరడానికి ముందు బెంగళూరు వెళ్లి డీకేఎస్‌తో మంతనాలు జరిపిన విషయం తెలిసిందే. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైన మోత్కుపల్లి నర్సింహులు సైతం బెంగళూరు వెళ్లి డీకేని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ విధంగా తెలంగాణ కాంగ్రెస్‌పై డీకే ప్రభావం గట్టిగానే ఉందని చెప్పుకోవచ్చు.

గాంధీ కుటుంబం పట్ల ఆయనకున్న అచంచలమైన విధేయత, అనేక క్లిష్టమైన సమయాల్లో పార్టీకి అండగా నిలిచిన వైనం.. సమస్యలను పరిష్కరించే విధానం.. డీకే శికుమార్‌ను కాంగ్రెస్‌లో టాప్ లీడర్‌గా నిలబెట్టాయి. కర్నాటక రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డీకేఎస్.. ఎన్ని సమస్యలు ఎదురైనా.. ఎదుర్కొని నిలబడి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. అందుకే.. డీకేపై గాంధీ కుటుంబానికి కూడా ప్రగాఢ విశ్వాసం. ఇలాంటి శివకుమార్.. ఇప్పుడు తెలంగాణ ఫోకస్ పెట్టడం రాజకీయంగా మరింత ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తోంది. విజయవంతమైన ఎన్నికల నిర్వహణ ట్రాక్ రికార్డ్ కలిగిన డీకేఎస్.. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌ను ఎలా నడిపిస్తారనేది ఆసక్తిగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..