
రెండవ దశ విజయభేరి బస్సు యాత్ర ఘనంగా ప్రారంభమైంది. మొదటిరోజు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పరిగి తాండూర్ చేవెళ్లలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ మూడు చోట్ల తెలంగాణలో ప్రకటించిన ఆరు హామీల ప్రచారమే ప్రధాన ఏజెండాగా మాట్లాడారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ప్రకటించిన ఆరు హామీలు దోహదపడతాయని కాంగ్రెస్ బలంగా నమ్ముతోంది కర్ణాటకలో బీజేపీ సర్కార్‌ని పక్కకు నెట్టి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అక్కడ ప్రకటించిన ఐదు హామీలే ప్రధాన కారణం. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మాస్టర్ మైండ్ అయినా డీకే శివకుమార్‌తో తెలంగాణలోని ఆరు గ్యారెంటీ లపై ప్రచారం చేయిస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని టీ కాంగ్రెస్ భావించింది. డీకే శివకుమార్ కి రేవంత్ రెడ్డికి మధ్య ఉన్న మంచి సాన్నిహిత్యం కూడా ఈ ప్రచారానికి బాగా దోహదపడింది.
తాండూర్‌లో డీకే శివకుమార్ మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పరుగులు పెట్టాలంటే సమర్థుడైన రేవంత్ రెడ్డికే టీపీసీసీ పగ్గాలు అప్పగించాలని నేను ఢిల్లీ పెద్దలతో మాట్లాడి రేవంత్ కి పదవి వచ్చేలా ప్రయత్నం చేశానని స్వయంగా ప్రకటించారు. మూడు చోట్ల నిర్వహించిన కార్నర్ మీటింగ్స్‌లో డీకే శివకుమార్ 6 గ్యారెంటీల గురించి మాత్రమే మాట్లాడారు. కర్ణాటకలో 5 హామీలను అమలు చేస్తున్నట్టే తెలంగాణలో అధికారంలోకి రాగానే అమలు చేస్తామని చెప్పారు. అసలు కర్ణాటక ఐదు హామీల కంటే తెలంగాణ ఆరు హామీలు అద్భుతంగా ఉన్నాయని ఇది కేవలం తెలంగాణకు మాత్రమే కాదు భవిష్యత్తులో దేశం మొత్తానికి ఈ హామీలు రోల్ మోడల్‌గా నిలుస్తాయని తెలిపారు.
ఈ నెల రోజుల మొత్తం ప్రచారంలో కాంగ్రెస్ ఆరు హామీలను బలంగా తీసుకెళ్లాలని వ్యూహరచన చేస్తోంది. తెలంగాణ ఎన్నికల క్యాంపెయిన్ డిజైన్ లో డీకే శివకుమార్ రూట్ మ్యాప్‌ను తయారు చేసినట్టుగా సమాచారం. రేవంత్ ఆధ్వర్యంలో తెలంగాణలో ఏర్పడబోతున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరు హామీలను అమలు చేస్తామని డీకే శివకుమార్ అన్నారు. డీకే శివకుమార్ ప్రసంగాన్ని అనువాదం చేస్తున్న రామ్మోహన్ రెడ్డి కూడా డిసెంబర్ 9న రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంటూ చెప్పారు. దీంతో తెలంగాణకు కాబోయే కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే డిస్కషన్ జనాల్లో జోరుగా సాగుతోంది. ఇదే ఇప్పుడు కాంగ్రెస్‌లో కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో ప్రకటించిన ఆరు హామీలు కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకురాబోతోందని టీ కాంగ్రెస్ నేతలు బలంగా నమ్ముతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..