నాగర్ కర్నూల్, జూన్ 25: మోదీ నేతృత్వంలో 9ఏళ్లలో భారత్ ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. మహా జన్‌సంపర్క్ అభియాన్‌లో భాగంగా నాగర్‌కర్నూల్‌లో నవసంకల్ప సభలో ఆయన ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. జోగులాంబ తల్లికి, పవిత్ర కృష్ణమ్మకు నమస్కరిస్తున్నా అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణ కోసం ఎంతోమంది ఆత్మబలిదానాలిచ్చారని.. తెలంగాణ కోసం ఆహుతైన వారికి నివాళులర్పిస్తున్నా అన్నారు. అయితే, తెలంగాణ వచ్చాక ఒకే కుటుంబం బాగుపడిందని అన్నారు. తెలంగాణ సామర్థ్యాన్ని కేసీఆర్ నాశనం చేశారని విమర్శించారు.
తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు దు:ఖంలో ఉన్నాయన్నారు. కేసీఆర్, ఆయన కుమారుడు, కుమార్తె మాత్రమే సంతోషంగా ఉన్నారని అన్నారు. మోదీ పాలనలో దేశం పురోగమిస్తోందన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 9 ఏళ్ల మోదీ పాలనలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టారని అన్నారు. మోదీ ప్రభుత్వం 80 కోట్ల మంది ప్రజలకు రేషన్ అందిస్తుందన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం పేదలకు అంకితం. మోదీ అధికారంలోకి వచ్చాక పేదరికం 10 శాతానికి పడిపోయిందన్నారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మోదీ 4 కోట్ల మందికి ఇళ్లు నిర్మించారని అన్నారు. కమల వికాసంతోనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు ఏటా రూ. 6 వేలు అందిస్తున్నామని అన్నారు. కొవిడ్, ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం ఏర్పిడిందన్నారు. ఐటీ, ఆటోమొబైల్ సహా అన్ని రంగాల్లోనూ భారత్ దూసుకుపోతోందన్నారు. మోదీని గ్లోబల్ లీడర్‌గా ప్రపంచమంతా కొనియాడుతోందన్నారు. మోదీ చేపట్టిన సంస్కరణలతో దేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందిందన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం