
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో దొంగలు రెచ్చిపోతున్నారు. అల్వాల్‌లో పట్టపగలే షట్టర్లు పగలగొట్టి దొంగతనానికి పాల్పడగా, అటు చెంగిచెర్లలో వరుస దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు ఎట్టకేలకు కటకటాల్లోకి నెట్టారు. అల్వాల్‌లోని అవెన్యూ కాలనీలో ఉన్న మమతా సాయి జ్యువెలర్స్‌లో ముగ్గురు దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి సమయంలో దుకాణం షట్టర్‌ను బలవంతంగా బ్రేక్ చేసి లోపలికి చొరబడ్డారు. సుమారు ఒక కిలో వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. వీటి విలువ సుమారు రూ.5 లక్షలకు పైనే ఉంటుందని బాధితులు చెబుతున్నారు. ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు షాపులోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ముగ్గురు వ్యక్తులు లోపలికి చొరబడి నగలు ఎత్తుకెళ్లడం స్పష్టంగా కనిపిస్తోంది. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్లలో ఈ నెల 15న ఒకే రాత్రి 9 ఇళ్లలో వరుస దొంగతనాలు జరగడం తీవ్ర కలకలం రేపింది. బాధితుల ఫిర్యాదు ప్రకారం.. 20 తులాల బంగారం, 6 కేజీల వెండి, రూ.2లక్షల నగదు చోరీకి గురయ్యాయి. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మేడిపల్లి, సీసీఎస్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ముఠాలోని ప్రధాన నిందితులు ఢిల్లీలోని తీహార్ జైల్లో పరిచయం కావడం గమనార్హం. జైలు నుంచి విడుదలయ్యాక వీరు ఒక ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నారు. A1 మహదేవ్, A2 పవన్ గుప్తా, A3 మంగళ్ సింగ్, A4 సీరం బీరేంద్రలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. వారిపై గతంలోనే పలు కేసులు నమోదైనట్లు తెలిపారు. నిందితుల నుంచి 2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఉప్పల్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు.