Telangana: జనగామ చిన్నారి తేజస్విని డెత్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. చిన్నారి మృతి వెనుక మిస్టరీ వీడిపోయింది. కన్నతల్లే హంతకురాలని తేల్చారు జనగామ పోలీసులు. అయితే, నవమాసాలు మోసి, కనిపెంచిన తల్లే.. తన బిడ్డను చంపాల్సిన అవసరం ఏమొచ్చింది అని ఆరా తీస్తే.. షాకింగ్ విషయాలు వెల్లడించింది. మరి ఎంత కష్టాన్నైనా తట్టుకుని బిడ్డల్ని కాపాడుకోవాల్సిన తల్లి, ఎందుకిలా చేసింది? చైన్‌స్నాచింగ్ డ్రామా ఎందుకాడింది? చివరికి ఎలా దొరికిపోయింది? అనే కీలక వివరాలు ఇప్పుడు చూద్దాం..
ముక్కు పచ్చలారని చిన్నారి.. ఇంకా ఏడాది కూడా నిండలేదు.. తన బోసి నవ్వులతో ఇల్లంతా సందడి చేస్తోంది.. ఆ నవ్వు చూస్తూనే సంతోషంగా బతికేయొచ్చు.. ఆ చిన్నారి తండ్రి, తాతా నానమ్మలు ఆ ముసిముసి నవ్వులను చూస్తూ మురిసిపోయేవారు.. కానీ కన్నతల్లి గుండె మాత్రం రగిలిపోయింది.. కన్నబిడ్డ ముసిముసి నవ్వులను తట్టుకోలేకపోయిందో ఏమో ఆ నవ్వుని సంపులో సమాధి చేసేసింది. తాను నవమాసాలు మోసి, కని-పెంచిన బిడ్డనే సంగతి కూడా మర్చిపోయి ఏ తల్లీ చేయకూడని ఘాతుకానికి పాల్పడింది.
జనగామ అంబేద్కర్‌నగర్‌లో ఈ దారుణం జరిగింది. అప్పటివరకు తల్లి సంకలో సేఫ్‌గా ఉన్న ఆ చిన్నారి, క్షణాల్లో శవంగా మారిపోయింది. కన్నతల్లే, తన బిడ్డను అత్యంత కర్కశంగా చంపేసింది. తల్లి ఎత్తుకుంటే ఆడించడానికి అనుకుంది, కానీ ఈ లోకం నుంచే శాశ్వతంగా పంపించడానికని ఊహించలేకపోయింది ఆ పసికందు.
అభంశుభం ఎరుగని పసికందును కర్కశంగా చంపేసిన ప్రసన్న, చైన్‌స్నాచింగ్ పేరుతో అందరినీ తప్పుదోవ పట్టించింది. చుట్టుపక్కల వాళ్లను, పోలీసులనే కాదు.. చివరికి భర్తను కూడా నమ్మించేందుకు పెద్ద హైడ్రామానే నడిపింది. ఇంటరాగేషన్‌లో ప్రసన్న పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చిన పోలీసులు, కూపీ లాగితే మొత్తం కథ బయటపడింది. సంపులో పడిపోయిందని చుట్టుపక్కల వాళ్లకు చెప్పింది ప్రసన్న, నిమిషాల వ్యవధిలోనే చైన్‌స్నాచింగ్ డ్రామా ఆడటంతో పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. కన్నబిడ్డను అత్యంత దారుణంగా కడతేర్చిన ఆ కర్కశ తల్లి, అందరినీ నమ్మించేందుకు కట్టుకథలు అల్లింది. చైన్ స్నాచర్లు వచ్చారని, తన పుస్తెల తాడు తెంపుకెళ్లారని, తాను తిరగబడటంతో బిడ్డను తీసుకెళ్లి నీటి సంపులో వేశారంటూ కట్టుకథలు అల్లింది.
అయితే, ఇదంతా కట్టుకథ అని పోలీసుల విచారణలో తేలింది. అనారోగ్య కారణాలు, ఎదుగుదల లోపంతోనే చిన్నారిని ఆ తల్లి చంపేసినట్లు గుర్తించారు పోలీసులు. లైఫ్ లాంగ్ తన కూతురు అనారోగ్యంతో ఇబ్బందులు పడకూడదనే చంపేసినట్లు పోలీసుల ఇంటరాగేషన్‌లో ఒప్పుకుంది ప్రసన్న. భర్త భాస్కర్ కంప్లైంట్‌తో హంతకురాలు ప్రసన్నపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు జనగామ పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..