
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త చర్చ మొదలు మొదలైంది. రాజకీయ ఉద్దండుల నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల వరకు అందరికీ ఈ కొత్త టెన్షన్ కలవరపెడుతుంది. అయితే ఈ టెన్షన్ ఓన్లీ ఫర్ మెన్స్.. పురుష రాజకీయ నాయకులను కలవర పెడుతున్న ఆ అంశమే మహిళా రిజర్వేషన్ బిల్లు.
గత ఏడాది ఉభయ సభల్లో ఆమోదం పొంది రాష్ట్రపతి వద్ద ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు జన గణన తర్వాత అమల్లోకి రానుంది. కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సంకేతం మేరకు 2027 తర్వాత మహిళా రిజర్వేషన్లు అమలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ లెక్కన తెలంగాణ అసెంబ్లీలో ఇప్పటికే 119 సీట్లు ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఆ సంఖ్య 153 కు పెరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తే అందులో 51 సీట్లు మహిళలకు కేటాయిస్తారు. అంతా బాగానే ఉంది కదా ఇందులో టెన్షన్ పడే విషయం ఏంటి అనుకుంటున్నారా!
ఇప్పటికే రెండు మూడు నాలుగు సార్లు గెలుస్తూ వస్తున్న రాజకీయ నాయకులు ఉన్నారు. వారసుల నిలబెట్టి అదే నియోజకవర్గంలో రాజకీయాలు చేస్తున్న ఉద్దండులు ఉన్నారు. నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చి అవకాశాలను అందిపుచ్చుకుని ఎమ్మెల్యేలైన యువతరం కూడా ఉంది. ఒక ఎమ్మెల్యేకు ఆయువుపట్టు నియోజకవర్గ. సొంతంగా ఒక నియోజకవర్గం.. అక్కడే శాశ్వత రాజకీయాలు చేస్తే రాజకీయాల్లో కూడా అంతే కాలం ఉండగలుగుతారు. నియోజకవర్గాలు మారడం వల్ల సక్సెస్ అయిన రాజకీయ నేతలు కేవలం వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు.
ఇప్పుడు మహిళా రిజర్వేషన్ వస్తే 51 నియోజకవర్గాల్లో మహిళలకు రిజర్వుడు సీట్లు కేటాయిస్తే… ఇప్పటికే ఆ నియోజకవర్గంలో గెలుపొందుతూ రాజకీయాలు చేస్తున్న పురుషుల సంగతి ఇక అంతే.. పోనీ ఇంట్లో ఉన్న ఆడవాళ్లను నిలబెట్టాలన్న అక్కడ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అయితే, ఇక ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి. పక్క నియోజకవర్గంలో పోటీ చేయాలన్న మళ్ళీ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినంత కష్టపడాల్సి ఉంటుంది… గెలుపునకు గ్యారంటీ లేదు.
ఇదంతా కాదు రిజర్వేషన్ లేకుండా కేవలం మహిళలకి రిజర్వేషన్ వస్తే ఇంట్లో ఎవరినైనా నిల్చోబెట్టాలి. ఇక్కడే ఓ విచిత్రమైన సమస్య రాజకీయ నేతలను గుచ్చుతుంది. ఇంట్లో రాజకీయాల్లో ఆసక్తి చూపించే మహిళలు ఉండాలి. చాలామంది వారి వారసులను విదేశాల్లో చదివిస్తున్నారు. వాళ్లు అక్కడే సెటిల్ అవ్వడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇంకొంతమంది రాజకీయ నాయకుల వారసులు పెళ్లిళ్లు చేసుకొని విదేశాల్లో సెటిలైపోయారు. రాజకీయాల పట్ల అనాసక్తిగా ఉన్నారు.
ఇక మరి కొంతమంది రాజకీయ నేతల పరిస్థితి ఇంట్లో పోటీ చేయడానికి మహిళలు లేకపోవడం… పిల్లలు చిన్న వాళ్ళ అవ్వడం, భార్య రాజకీయాల పట్ల పూర్తి అనాసక్తి చూపించడం.. ఇలా ఇక సీటు వదులుకోవాల్సిందేనా అని పరిస్థితి వాళ్ళది. ఇక మరి కొంతమంది రాజకీయ నేతలు కూతుళ్లు లేకపోవడంతో కోడళ్లను రంగంలోకి దింపడానికి ప్రయత్నాలు చేస్తుంటే… అది కుటుంబ సమస్యగా మారుతుందట. ఇద్దరు కోడళ్ళు ఉన్న వాళ్ళకి నేను పోటీ చేస్తానంటే నేను పోటీ చేస్తానని ఇంటర్నల్ కాంపిటీషన్ మరో తలనొప్పి.
అసలు ఏ నియోజకవర్గం మహిళలకు రిజర్వ్ అవుతుందో తెలియని పరిస్థితుల్లోనే ఇన్ని టెన్షన్స్ ఉంటే… రిజర్వేషన్ అమల్లోకి వచ్చేనాటికి ఎంతమంది రాజకీయ నాయకులు పొలిటికల్ స్క్రీన్ పైనుంచి మాయం అవుతారో చూడాలి. ఇదంతా ఒక్క ఎత్తు అయితే ఇప్పటికే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న మహిళ నేతలకు ఇది ఒక వరంగా మారనుంది. రిజర్వేషన్ స్థానాల్లో అప్పటికే రాజకీయాలు చేస్తున్న మహిళలకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. కేవలం ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులే కాదు… జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, జడ్పిటిసిలు ఇలా రకరకాల హోదాల్లో పని చేసే మహిళా మణులు రిజర్వేషన్ అందిపుచ్చుకుంటే ఈజీగా ఎమ్మెల్యేలు అయిపోవచ్చు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..