సడెన్‌గా ఒక చిన్న పురుగు కనిపిస్తేనే జడుసుకుంటాం. అలాంటి ఏకంగా పాము కనిపిస్తే.. అందులోనూ నివాసం ఉండే ఇంట్లోకి దూరితే పరిస్థితి మరింత భయానకంగా ఉంటుంది. ప్రాణ భయంతో అటూ ఇటూ పరుగులు తీయడం ఖాయం. అంతో ఇంతో ధైర్యం ఉంటే ఇంట్లోకి వచ్చిన పామును చంపేందుకు ప్రయత్నిస్తారు. లేదంటే చుట్టుపక్కల వారిని పిలిచి విషయం చెబుతాం. వారి వల్లా కాకపోతే.. స్నేక్ క్యాచర్స్ కి కాల్ చేసి పిలిపిస్తాం. అయితే, ఇక్కడ ఓ వ్యక్తి తన ఇంట్లో దూరిన పామును చూసి మొదట భయపడినప్పటికీ.. ఆ తరువాత ధైర్యం చేసి దానిని చంపేందుకు ప్రయత్నించాడు. అయితే, పాము ఎంతకీ చిక్కకుండా, సందులల్లో నక్కడంతో పొగ పెట్టి బయటకు పంపాలని ప్రయత్నించాడు. ఆ ప్రయత్నం కాస్తా విఫలమై.. ఇల్లంతా తగులబడిపోయింది. పండుగ వేళ ఆకుటుంబం రోడ్డుపాలైంది.
సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం బడంపేట్ గ్రామంలో చోటచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇదే గ్రామానికి చెందిన గడ్డమీది మొగులయ్య దసరా పండగ సందర్భంగా ఇల్లు శుభ్రం చేసుకుంటుండగా పాము కనిపించింది. దానిని చూసి బెదిరిపోయిన మొగులయ్యా.. ఆ తరువాత పామును చంపేందుకు కర్ర తీసుకుని ప్రయత్నాలు చేశాడు. ఎంత యత్నించినా పాము దొరకలేదు. మూలల్లో నక్కింది. దాంతో విసిగిపోయిన మొగులయ్య కారు టైరు కాల్చి పాము ఉన్న స్థలంలో పెట్టాడు. టైరు మంటలు.. ఇంటి వాసాలకు అంటుకోవడంతో.. మొగులయ్య ఇల్లు పూర్తిగా దగ్ధమయ్యింది. పాము కోసం పొగ పెడితే.. ఏకంగా ఇల్లే కాలిపోవడంతో కుటుంబం అంతా రోడ్డున పడింది. ఈ ఘటనలో బాధిత కుటుంబ సభ్యులు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలోపడిపోయారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..