Hyderabad: గుండెను పిండేసే విషాదం.. భారీ వర్షాలతో గోడకూలి 8 నెలల పసిపాప మృతి..

|

Apr 26, 2023 | 12:43 PM

‘ఇంకా నాలుగు రోజులైతే చాలు.. ఆ ఇళ్లు ఖాళీ చేసే వాళ్లం.. మా పాప ప్రాణాలు దక్కేవి’ అంటూ.. విధి వక్రీకరించి చిన్నారి తమకు దక్కకుండా పోయిందని బోరున విలపించారు బంధువులు. హైదరాబాద్‌ బోరబండలోని రహమత్‌నగర్‌లో ఉన్న కార్మికనగర్‌లో నిన్న రాత్రి కురిసిన వర్షాల కారణంగా గోడకూలి 8 నెలల పాప జీవనిక మృతి చెందిన ఘటన కాలనీ వాసులను కన్నీటి పర్యంతం చేసింది.

గాలి-వాన బీభత్సం ఓ చిన్నారి ప్రాణాలు బలిగొంది. హైదరాబాద్‌ రహ్మత్‌నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పక్కనున్న భవనంపై నుంచి రెయిలింగ్‌ కూలి రేకులషెడ్డుపై పడింది. ఇంటిలో నిద్రిస్తున్న పాప స్పాట్‌లోనే చనిపోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. హైదరాబాద్ రహ్మత్‌నగర్‌లోని కార్మికనగర్‌లో చిన్నారి జీవనిక మృతి చెందిన ఘటన అందర్నీ కలిచివేస్తోంది. పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్‌ వచ్చిన ఆ దంపతులకు తీరని విషాదం నింపింది. రాత్రి కురిసిన భారీవర్షం ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న పసికూన, కళ్లముందే కాటికి వెళ్లిపోవడం ఆ దంపతులు జీర్జించుకోలేకపోతున్నారు.

మెదక్‌జిల్లా నారాయణఖేడ్‌కి చెందిన శ్రీకాంత్‌ జగదేవి దంపతులు బ్రతుకు దెరువుకోసం హైదరాబాద్ వచ్చి కూలిపని చేసుకుంటూ బోరబండ సమీపంలోని రహమత్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. నిన్న రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో పక్కనే ఉన్న నాలుగో అంతస్థు బిల్డింగ్‌ రెయిలింగ్‌ కూలి, పక్కనే ఉన్న రేకులషెడ్డుపై కూలింది. ఇంట్లో నిద్రిస్తున్న పాపపై శిథిలాలు పడటంతో పాప జీవనిక ప్రాణాలు వదిలింది.

‘ఇంకా నాలుగు రోజులైతే చాలు.. ఆ ఇళ్లు ఖాళీ చేసే వాళ్లం.. మా పాప ప్రాణాలు దక్కేవి.. విధి వక్రీకరించి చిన్నారి తమకు దక్కకుండా పోయింది’ అంటూ బోరున విలపించారు జీవనిక నాన్నమ్మ. తమకు న్యాయం చేయాలని కోరుతోంది. కాగా, ప్రమాదం జరిగినప్పుడు పాప జీవనిక మాత్రమే ఆ ప్లేస్‌లో ఉంది. పెద్దపాప, తల్లిదండ్రులంతా బయటే ఉన్నారు. ఒకవేళ అందరూ కలిసి నిద్రిస్తున్న సమయంలో ఘటన జరిగి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని జీవనిక తల్లి చెబుతోంది.

ఇవి కూడా చదవండి

ఘటనా స్థలాన్ని స్థానిక కార్పొరేటర్‌ సీఎన్ రెడ్డి పరిశీలించారు. పాప తల్లిదండ్రులను పరామర్శించారు. జీహెచ్‌ఎంసీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. పాప కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇక, రహమత్‌నగర్‌ కార్మికనగర్‌లో రెయిలింగ్‌ బిల్డింగ్స్‌ చాలానే ఉన్నాయి. ఏ ఒక్కదానికి పర్మిషన్‌ లేకున్నా..ఇంటి అద్దెలకోసం మూడు, నాలుగు ఫ్లోర్‌లు వేసి వదిలిపెట్టారు. సిమెంట్ సీల్‌ చేయకుండానే ఇటుకలు పేర్చి అలానే వదిలేశారు. గట్టిగా గాలివాన వస్తే రెయిలింగ్‌ కూలి పక్కనున్న ఇళ్లపై పడి ప్రమాదానికి కారణమవుతున్నారు. టీవీ9 టీమ్‌ ఈ దృశ్యాలను వెలుగులోకి తీసుకొచ్చింది.

చిన్నారి జీవనిక మృతికి కారణమెవ్వరు..? ఈ పాపం ఎవరిది..? కార్మికనగర్‌లో విచ్చలవిడిగా భవనాలు వెలిసినా జీహెచ్ఎంసీ అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..