Telangana Weahter Forecast: వేసవి కాలంలో పలు రాష్ట్రాల్లో వింత పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు ఎండలు మండిపోతుండగా.. మరో వైపు అకాల వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఇప్పటికే రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలకు కొన్ని రోజులుగా ఉపశమనం కలుగుతోంది. ఓ వైపు ఎండలు విజృంభిస్తుండగానే.. వారం నుంచి తెలంగాణలో వర్షాలు కూడా కురుస్తున్నాయి. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు కురిశాయి. ఈ తరుణంలోనే బుధవారం, గురువారం కూడా తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుంచి ఇంటీరియర్ కేరళ మీదుగా సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతుందని వాతావారణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో తెలంగాణలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది.
మంగళవారం మధ్యాహ్నం నుంచి రాష్ట్రంలోని పలుచోట్ల ఓ మోస్తరు వానలు కురువడంతో వాతావరణం కొంత చల్లబడింది. వికారాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, హైదరాబాద్‌లో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షంతోపాడు వడగండ్లు కూడా పడ్డాయి. కాగా.. బుధ, గురువారాల్లో తెలంగాణలోని నైరుతి, ఉత్తర, తూర్పు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, వడగండ్లు కూడా పడే సూచనలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
Also Read: