Nalgonda, October 07: కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్టైలే వేరు. హాట్ హాట్ కామెంట్స్‌తో నిత్యం వార్తల్లో ఉంటారు. అయితే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సీఎం పదవికి పోటీపడే నేతలు వెనక్కి తగ్గేదేలే అంటున్నారు. తాజాగా సీఎం పదవిపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన కామెంట్స్ చేశాడు. కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరైనా సీఎం కావచ్చు , ఏదో ఒక రోజు నేను కూడా సీఎం అవుతానని ఆయన అన్నారు. కోమటిరెడ్డి చేసిన ఈ కామెంట్స్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి.
నల్లగొండ జిల్లా నక్రేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న తర్వాత తొలిసారిగా ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి నక్రేకల్ కు వచ్చాడు. ఈ సదర్భంగా చిట్యాల మండలం పంతంగి టోల్ ప్లాజా నుంచి నక్రేకల్ వరకు కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. నక్రేకల్ చౌరస్తాలో జరిగిన సభలో ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎంపి మధయాష్కీ, వేముల వీరేశం పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ.. కార్యకర్తలకు పెద్ద పీట వేస్తుందని, కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సీఎం కావచ్చని ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
ఏదో ఒక రోజు తాను కూడా సీఎం అవుతానంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా కార్యకర్తలు సీఎం కోమటిరెడ్డి అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. మోసపూరిత మాటలతో ఎన్నికల్లో మళ్లీ గెలవాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారని విమర్శించారు. కేటీఆర్, హరీష్ రావు హెలి కాఫ్టర్ లో తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ పై అబద్ధాలు చెపుతున్నారని ఆయన ఆరోపించారు. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, నకిరేకల్ నుంచి వేముల వీరేశం గెలుపు ఖాయమని, మెజారిటీ కోసం ప్రయత్నించాలని ఆయన క్యాడర్ ను కోరారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో సీఎం కేసీఆర్ కు భయం పట్టుకుందని, ఎన్నికలు రాగానే పథకాలు గుర్తుకు వస్తాయని విమర్శించారు. ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టేందుకు సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు పంపిణీ చేశారని కోమటిరెడ్డి విమర్శించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..