వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YTP) అధ్యక్షురాలు వైఎస్.షర్మిల(YS.Sharmila) కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను ఖమ్మం జిల్లా పాలేరు నుంచే పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. నేలకొండపల్లి శివారులో నిర్వహించిన పార్టీ నేతల సమావేశంలో ఆమె మాట్లాడారు. కార్యకర్తలు, పార్టీ నేతల వల్లే తాను 1,300 కిలోమీటర్లు నడిచినట్లు చెప్పారు. పాలేరు నుంచి పోటీ చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారన్న షర్మిల.. ఖమ్మం జిల్లాలో(Khammam) వైఎస్సార్ ఫొటో పెట్టుకుని ఎంతో మంది గెలిచారని పేర్కొన్నారు. వైఎస్సార్ ను విమర్శించే స్థాయి మంత్రి పువ్వాడకు లేదని చెప్పారు. బయ్యారం మైనింగ్‌లో తనకు వాటా ఉన్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని, ఈ విషయంలో తన బిడ్డలపై ప్రమాణం చేసి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. మంత్రిగా ఎటువంటి అవినీతికి పాల్పడలేదంటూ తన బిడ్డలపై ప్రమాణం చేసే ధైర్యం పువ్వాడకు ఉందా? అని ఆమె సవాల్ విసిరారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
వైఎస్సార్ సంక్షేమ పాలన పాలేరు నుంచే మొదలు కావాలి. వైటీపీ జెండా పాలేరు గడ్డపై ఎగరాలి. అత్యధిక మెజారిటీ కోసం అందరూ పనిచేయాలి. చరిత్రలో ఎన్నడూ ఎరగని మెజారిటీ కోసం పనిచేద్దాం.
– వైఎస్ షర్మిల, వైటీపీ అధ్యక్షురాలు
కాగా.. కొన్ని రోజుల క్రితం వైటీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్నతో పంచాయితీ ఉంటే ఆంధ్రలో చూసుకోవాలని.. తెలంగాణకు వచ్చి ఏం సాధిస్తారని ఘాటుగా ప్రశ్నించారు. దమ్ముంటే ఖమ్మంలో నాపై పోటీ చేసి గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. పాలేరులోనూ నా దమ్ము చూపిస్తానని తీవ్రంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో పెను సంచలనంగా మారాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి