పోలీసులకు బండి చిక్కితే ఏం చేస్తారు? డబ్బు కట్టి విడిపించుకుంటారు. బండి ధరకన్నా ఎక్కువ చలాన్ వస్తే.. బండికో దండం పెట్టి దాన్ని అక్కడే వదిలిపెట్టి వెళ్లిపోతారు.. కానీ విసిగెత్తిన కొందరు ఏం చేస్తున్నారంటే.. బండిని తగలబెట్టేస్తున్నారు. తాజాగా ఘటనలో ఇదే జరిగింది. హైదరాబాద్ నాంపల్లిలో ట్రాఫిక్ పోలీసులు- డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. సరిగ్గా నాంపల్లి స్టేషన్ ముందు చేతక్ పై వచ్చిన సజ్జత్ అలీ ఖాన్ అనే వ్యక్తిని కూడా దొరికిపోయాడు. అలీ పూటుగా మందు కొట్టి అడ్డంగా బుక్కయిపోయాడు. మందు మీటర్ గిర్రున తిరిగితే.. పోలీసులు అంత తేలిగ్గా వదులుతారా? అతడి బండి లాక్ వేసి.. సీజ్ చేశారు. అక్కడి నుంచి అలీ మారాం చేయడం మొదలు పెట్టాడు. నా బండి నాకిచ్చేయమని రకరకాలుగా ప్రాధేయ పడ్డాడు.
అసలే మందు మత్తు మీదున్నాడు. నయానా- భయానా పోలీసులకు ఎంతో చెప్పి చూశాడు. కానీ అతడి ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఇలాక్కాదని చెప్పి.. తన బండికి తానే నిప్పు పెట్టేశాడు. ఈ హఠాత్ ఘటనకు ఒక్కసారిగా అదిరిపడ్డ పోలీసులు.. ఆగమేఘాల మీద ఆ బండిని ఆర్పే యత్నం చేశారు. మంటలార్పడం అయ్యాక- ఇతడిపై 70-B కింద న్యూసెన్స్ కేసు పెట్టారు.
మొన్నామధ్య ఆదిలాబాద్ లో కూడా ఇంతే. చలాన్లు కట్టమన్నారని చెప్పి.. ఒక యువకుడు ఇలాగే చేశాడు. అది పత్తి రైతుల ధర్నా జరుగుతున్న సమయం.. ఆ సమయంలో ఫరీద్, మక్బూల్ ఇద్దరూ.. పోలీసులకు చిక్కారు. ఫరీద్ బండి మీద 2 వేల రూపాయల వరకూ చలాన్లు బకాయిలున్నాయి. వీటిని కట్టమన్నందుకు అతడు తన బైక్ నే తగలబెట్టేశాడు. దీంతో అతడ్ని , అతడికి సహకరించిన మక్బూల్ ని అరెస్టు చేశారు పోలీసులు. డ్యూటీలో ఉన్న ఎస్సై మీద దురుసుగా వ్యవహరించాడన్న కారణం మీద ఈ కేసు బుక్ చేశారు ఆదిలాబాద్ పోలీసులు.
ఇవి కూడా చదవండి: RBI Digital Payment: గుడ్‌న్యూస్.. ఇక నెట్ లేకుండానే చెల్లింపులు చేయవచ్చు..
CM KCR: లాక్డౌన్ విధించాల్సిన అవసరం లేదు.. కానీ జాగ్రత్తగా ఉండాలి..