
హైదరాబాద్ నగరంలోని మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దొంగతనం కేసు నమోదైంది. ఇద్దరు యువకులు తెలివిగా దొంగతనం చేసి కిరాణ దుకాణం నుంచి ఆయిల్ కాటన్‌లను తీసుకుని గుట్టు చప్పుడు కాకుండా యాక్టీవా వాహనంపై అక్కడి నుంచి పరారయ్యారు. రద్దీగా ఉన్న మార్కెట్ ఏరియాలో ఉన్న ఓ షాపు ముందు యాక్టీవా వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు ఆగారు. ఆ షాపు ముందటి భాగంలో ఆరుబయట కొన్ని వస్తువులు పెట్టబడి ఉన్నాయి. ఓనర్స్ షాపులో ఉండిపోవడంతో బయట జరిగేది పెద్దగా గమనించే అవకాశం లేదు. ఇదే మంచి అవకాశం అనుకున్నారో ఏమో.. కాసేపు అక్కడ బండిని నిలిపి చుట్టుపక్కల అంతా ఒకసారి పరిశీలించుకున్నారు. ఎవరైనా తమని గమనిస్తున్నారా అని కాసేపు చూసుకున్నారు. ఆపై ఒక యువకుడు బండిపైనే ఉండగా.. మరో యువకుడు బండి దిగి ఆ షాపు బయట ఉంచిన ఆయిల్ కాటన్‌లు ఒక్కొక్కటీ ఎత్తి బండిపై ఉంచాడు. అలా రెండు కాటన్‌లను పెట్టిన తర్వాత మళ్లీ కాసేపు అటూఇటూ అక్కడే తచ్చాడుతూ ఏదో కొనడానికి వచ్చినవాడిలాగా కాసేపు నటించాడు. ఎవరూ గమనించడం నిర్ధారించుకున్న అనంతరం మరోమారు ఇంకో కాటన్‌ను ఎత్తి బండిపై ఉంచి వెంటనే తానూ ఎక్కేసి అక్కడి నుంచి పరారైపోయారు.
ఈ తతంగం అంతా అక్కడి సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయింది. పైగా వాళ్లు అలా దొంగతనం చేసుకుని వెళ్తున్నప్పుడు చుట్టుపక్కల వాళ్లు ఎవరూ పెద్దగా గుర్తించినట్లుగా కనబడలేదు. ఇదంతా ఇలా ఉండగా.. ఆ షాపు యజమాని తన సామాను దొంగిలించబడిన విషయం తర్వాత గ్రహించాడు. వేల విలువ చేసే సామాగ్రి దొంగతనం జరగడంపై ఆందోళన చెందాడు. ఈ ఘటనపై బాధితుడు మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధితుడికి తగిన న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..