ప్రయాణికులకు మరింత చేరువ అయ్యేందుకు టీఎస్‌ఆర్టీసీ పటిష్ఠ ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇందులో భాగంగా అన్ని వర్గాల ప్రయాణికులను ఆకట్టుకునేందుకు కొత్త సదుపాయాలు, కార్యక్రమాలను అమల్లోకి తెస్తోంది. తాజాగా నగరప్రయాణిలకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. కొత్తగా మరికొన్ని బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఏకంగా1020 సిటీ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానుంది టీఎస్ఆర్టీసీ. ఈ కొత్త బస్సుల్లో సూపర్ లగ్జరీ, ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఉన్నాయి. ఈ బస్సులను సొంతంగా కొనుగోలు చేయనుంది టీఎస్‌ఆర్టీసీ. గ్రేటర్‌లో ఇప్పటికే పాత సిటీ బస్సులు 720 ఉండగా వాటిని తుక్కు కింద మార్చనున్నట్టు అధికారులు వెల్లడించారు. జిల్లాల్లో పాతబడిపోయిన సూపర్ లగ్జరీ బస్సులను గ్రేటర్‌లోకి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
ఇక విద్యార్థులకు మరిన్ని సదుపాయాలను అందుబాటులోకి తేవనుంది టీఎస్‌ఆర్టీసీ. దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు సాగించే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ విద్యార్థుల బస్‌పాస్‌లను గ్రేటర్ హైదరాబాద్ పరిమితి వరకు అనుమతించాలని ఆర్టీసి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శివార్లలోని కళాశాలలు, ఇతర విద్యా సంస్థల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో చదువులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం సిటీ బస్సుల్లోనే వారి పాసులు చెల్లుబాటు అవుతున్నాయి. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో విద్యార్థుల సాధారణ బస్సు పాసులను అనుమతించడం లేదు. నగర శివారులో సిటీ బస్సులు తక్కువగా తిరుగుతున్నందున వీరు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు ఆర్టీసీ సిటీ బస్‌పాస్ ఉన్న విద్యార్థులను పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులోనూ ప్రయాణించేందుకు అనుమతిస్తూ ఆర్టీసీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..