ఇప్పటికే ధరల పెరుగుదలతో అల్లాడుతున్న సామాన్యులకు తెలంగాణ ఆర్టీసీ(TSRTC) మరో షాక్ ఇచ్చింది. రెండురోజుల క్రితమే డీజిల్ సెస్ పేరుతో బస్సు ఛార్జీలు భారీగా పెంచిన ఆర్టీసీ తాజాగా రూట్ బస్‌పాస్ ఛార్జీలనూ(Bus Pass Charges) పెంచేసింది. 4కిలో మీటర్ల దూరానికి గతంలో రూ.165 ఉన్న బస్ పాస్ ఛార్జీని రూ.450కు, 8 కిలోమీటర్ల దూరానికి రూ.200 ఉన్న ఛార్జీని రూ.600కు, 12 కిలోమీటలర్ల దూరానికి రూ.245 నుంచి రూ.900లకు, 18కిలోమీటర్లు దూరానికి రూ.280 నుంచి రూ.1,150కు, 22 కిలోమీటర్ల దూరానికి రూ.330 నుంచి రూ.1350కు పెంచింది. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని, ఆర్టీసీకి సహకరించాలని అధికారులు కోరారు. ఈ పెంపుతో విద్యార్థులపై పెను భారం పడనుంది. కాగా.. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు చదువుకునేందుకు పట్టణాలకు వస్తుంటారు. సాధారణంగా వీరు నెలవారీ బస్ పాస్ తీసుకుని ప్రయాణాలు చేస్తారు. ఈ క్రమంలో తాజాగా పెంచిన ఛార్జీలు వారిపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.
రెండు రోజుల క్రితమే తెలంగాణలో డీజిల్ సెస్ పేరుతో ఛార్జీలు పెరిగాయి. పెరిగిన ధరలు నిన్నటి నుంచే (జూన్ 9) అమల్లోకి వచ్చాయి. పల్లె వెలుగు బస్సుల్లో 250 కి.మీ. దూరానికి ప్రస్తుతం ఈ సెస్ (Diesel Cess) రూ.5 ఉండగా.. దీన్ని రూ.45కు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో 500 కి.మీ.దూరానికి రూ.5 నుంచి రూ.90కి, డీలక్స్ బస్సుల్లో 500 కి.మీ దూరానికి రూ.5 నుంచి రూ.125కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సూపర్ లగ్జరీ బస్సుల్లో 500 కి.మీ దూరానికి డీజిల్ సెస్ రూ.10 నుంచి రూ.130కి పెంచారు. ఏసీ సర్వీసుల్లో 500 కి.మీ. దూరాకి రూ.10 నుంచి రూ.170కి పెంచారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి