Hyderabad: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేవలం హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్ అయిన ఆటోలని మాత్రమే ఓలా, ఉబెర్‌ల తరపున తిరగడానికి అనుమతిస్తామని తెలిపారు. బయటి ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ అయిన ఆటోలు నగరంలో తిరగడానికి అనుమతి లేదని ప్రకటించారు. ఆటో కార్మిక సంఘాలు చేసిన విజ్ఞప్తి మేరకు నగర ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి బయటి ప్రాంతాల ఆటోలు నగరంలో విచ్చలవిడిగా తిరగడంతో లోకల్ ఆటోడ్రైవర్లు చాలా నష్టపోతున్నారు.
ఈ విషయాన్ని హైదరాబాద్ ఆటో సంఘాల ప్రతినిధులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కమిషనర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ద్విచక్ర వాహనాలపై కూడా ఆంక్షలు విధించారు. ఓలా, ఉబెర్‌లకు అనుసంధానమై నడిపేందుకు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రవాణాశాఖలో టీఎస్ 09 నుంచి టీఎస్ 13 వరకు గ్రేటర్ పరిధిలో నమోదైన ఆటోలను మాత్రమే నడపాలని అధికారులు సూచించారు. ఈ సిరీస్ ఆటోలు మినహాయించి మిగతా సిరీస్‌లో కనిపించే ఆటోలకు అనుమతి ఉండదన్నారు. అయినా కూడా తిరిగితే జరిమానా తప్పదని హెచ్చరంచారు. అయితే ఇలా చేయడం వల్ల బయటి వాహనాలు అత్యవసర సమయంలో నగర పరిధిలోకి రావడానికి ఇబ్బంది పడుతారు. కానీ కొన్ని షరతులు విధించి వీటికి అనుమతులు జారీ చేస్తారు. ఈ విషయం సమగ్ర అధ్యయనం చేసి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా రాత్రిపూట రోడ్లపై వేగంగా తిరిగే బైక్‌లు, కార్ల వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించారు. త్వరలోనే అలాంటి వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.