హైదరాబాద్, సెప్టెంబర్ 4: సంచలనం సృష్టించిన మాదాపూర్ డ్రగ్స్ కేసులో 18 మందిని విచారిస్తామని నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సునీతా రెడ్డి అన్నారు. ఈ డ్రగ్స్ కేసులో పలు రంగాలకు చెందిన వారు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు బ్యూరో ఎస్పీ తెలిపారు. గతంలో డ్రగ్స్ కేసులో పట్టుబడినవారు సైతం ఇందులో ఉన్నారని దర్యాప్తులో వెల్లడయిందని ఆమె అన్నారు. ప్రాథమిక వివరాలను బట్టి 18 మందిని కస్టమర్లుగా గుర్తించి వారి కోసం గాలిస్తున్నారు. అయితే ఇంతకు ఆ 18 ఎవరు..? వాళ్లు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులా..? లేక ఇంకెవరన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పోలీసులు విచారణలో ఇంకా ఎలాంటి సంచనల విషయాలు బటయటకు వచ్చాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ డ్రగ్స్ కేసులో ఇప్పటికే సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సినీ ఫైనాన్షియర్ వెంకట రత్నాకర్ రెడ్డి విషయంలో రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.
18 మందికి డ్రగ్స్ అమ్మినట్టు ఇప్పటికే విచారణలో ఒప్పుకున్నాడు వెంకట్. రాంచంద్, అర్జున్, ఉప్పలపాటి రవి, సుశాంత్ రెడ్డి, ఇంద్రతేజ, కలహర్ రెడ్డి, సురేష్, రాంకుమార్, ప్రణీత్, సందీప్, సూర్య, శ్వేత, కార్తిక్, నర్సింగ్, హిటాచీ, అజీమ్, అంజద్‌కు అమ్మినట్టు ఒప్పుకున్నాడు వెంకట్. మరో వైపు గతంలో డ్రగ్స్ వ్యవహారంలో.. ఉప్పలపాటి రవి, సుశాంత్, కలహర్‌రెడ్డి పేర్లు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన వెంకట రత్నాకర్ రెడ్డి, బాలాజీ, మురళిని పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో నిందితులను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు.
హైదరాబాద్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వెంకట రత్నారెడ్డి విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. పార్టీల పేరుతో ప్రముఖుల్ని బురిడీ కొట్టించడం లాంటి మోసాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఇదే పనిగా తెలుగు రాష్ట్రాల్లో వెంకట రత్నారెడ్డిపై 25కు పైగా కేసులు ఉన్నాయి. ఐఆర్‌ఎస్ అధికారినంటూ నిర్మాతలు సి. కల్యాణ్, రమేష్ నుంచి 30 లక్షల రూపాయలకు పైగా వసూలు చేశాడు. ఇంకా ఓ మహిళా ఐఆర్‌ఎస్‌ను పెళ్లి పేరుతో చీట్ చేశాడు. పక్క రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచార దందా నిర్వహించాడు. విచారణలో ఇలా ఎన్నో విషయాలు బయటికొస్తున్నాయి. భాగ్యనగరంలో డ్రగ్స్ పార్టీలు జరుగుతున్నట్లు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పోలీసుల విచారణలో తేలింది.
కస్టడీలో ఉన్న వెంకట రత్నాకర్ రెడ్డి మొబైల్‌ను పరిశీలిస్తున్నారు నార్కోటిక్ పోలీసులు. కొకైన్, ఎల్‌ఎస్‌డీ, గంజాయ్‌తో పాటు ఇంకా ఏ తరహా డ్రగ్స్‌ను పార్టీల్లో ఉపయోగిస్తున్నారనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. వెంకట రత్నాకర్ రెడ్డితో పరిచయాలు, సన్నిహితంగా ఉన్న వాళ్లను దర్యాప్తులో భాగంగా ప్రశ్నించాలని పోలీసులు భావిస్తున్నారు. ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొచ్చాడు? ఎవరిద్వారా సరఫరా చేస్తున్నాడు? నైజీరియన్లతో వెంకట్‌కు ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే వెంకట్ నిర్వహించే డ్రగ్స్ పార్టీలకు హాజరైన వారి చిట్టాను కూడా సేకరిస్తున్నారు పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..